3674* వ రోజు ... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

2 గంటలపైగా 44 గురి శ్రమదానం - @3674*

               శ్రమ వేడుక శనివారం (6.12.25) నాటిది, రామానగరం, శివరామపురం లాంటి పొరుగూరి కార్యకర్తలకైతే 4 కిలోమీటర్ల దూరాన – నాగాయలంక రోడ్డులో కాసానగర తటాకం దగ్గరిది,

               ఇంత చలిలో - మంచులో ఇందరు చిమ్మచీకటిలో 150 కి పైగా గజాల రహదారిని సేవించారని నేను వ్రాస్తుంటే క్రొత్తవాళ్ళు నమ్మలేనిది, DRK-శంకరశాస్త్రుల ఫోటోలు చూస్తే కొంత నమ్మగలిగినది, అందుకే ప్రతి రోజూ ముఖపుస్తకంలో చూసీ, ఇక్కడి వాళ్ళకు ఫోన్లు చేసీ, దూరస్తులు వచ్చి చూసి గాని నమ్మి, ముక్కున వేలేసుకొని వెళ్తున్నది!

               ఎవరికి వాళ్ళో - జంటలుగానో రహదారి బారునా శ్రమించిన 44 మంది కార్యకర్తల కష్టాలు సరే - ఇష్టపడి గ్రామ బాధ్యతలు పంచుకొన్నప్పటి వాళ్ల శ్రమానందాన్నీ – వివిధ దశల్లో వారి శ్రమభంగిమల్ని వర్ణించాలనుకొన్న నా కష్టాలు నావి!

               కనీసం 44 పేజీలైనా నింపితే గాని ఈ శనివారం వేకువ శ్రమదాన స్ఫూర్తికి న్యాయం చేసిన తృప్తి ఉండదు!

               కాస్తంత ఆలస్యంగా వచ్చినా యువ మిత్రుల పని వేగమూ, చెరువు గట్టు కోత నివారించి, రోడ్డు రక్షణకు వారి ప్రయత్నమూ.....

               రోజూ ఆస్పత్రిలో చూస్తున్నా ఈ వేకువ స్వచ్ఛ కార్యకర్తలుగా మారిన మహిళా సిబ్బంది పని ఒడుపులూ....

               ఆరితేరిన ముగ్గురు ముదురు కార్యకర్తలు అమర వీర ప్రాంగణంలో కష్టించిన తీరూ...

               ఒరిగిన, దట్టంగా వ్యాపించిన చెట్ల కొమ్మల్ని తొలగించి, 10 మంది కలిగించిన సౌకర్యమూ..

               అదేదో తమ ఇల్లన్నట్లు రహదారిని ఊడుస్తున్న ప్రయత్నమూ....

               ఇవాళ ఆలస్యంగా 6.15 తర్వాత మ్రోగిన విజిలూ...

               వీటిలో ఏ ఒక్కదాన్నైనా పేరాలు పేరాలు వ్రాయాలి!

               రోజూ గంటన్నరకుపైగా 40-50 పని గంటల చొపున ఇన్నాళ్లుగా తాము సుందరీకంచిన రహదారిని చూస్తున్న స్వచ్ఛ సైనికుల ముఖాల్లో సంతృప్తీ, సమీక్షా కాలంలో నిన్నటి - నేటి - రేపటి పని ముచ్చట్లూ,

               మాలెంపాటి రంగారావు గారు తన పుత్త్రుని పంచెల వేడుకకు అభిమానంతో కార్యకర్తల్ని రేపటి ఉదయ-మధ్యాహ్నాల్లో అహ్వానించడమూ,

               అదివారం నాటి శ్రమదానం కూడ ఈ కాసానగర్ వద్ద అనే నిర్ణయమూ....

               ఇవన్నీ నేటి విశేషాలు!

               ఏమని కీర్తించ వలెను-1

కలుపు, పిచ్చిచెట్లు నరికి కార్చు చెమట చుక్కలనా?

 రోడ్లపైకి పెరుగు చెట్ల కొమ్మ నరుకు కష్టమునా?

 చీపుళ్లతొ రహదార్లను చిమ్ముతున్న దృశ్యమునా?

దేన్నని వర్ణించదగును? ఏమని కీర్తించ వలెను?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    06.12.2025