3693* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

గురువారం (25.12.25) – క్రిస్టమస్ పర్వదినాన సైతం - @3693*

               ఇప్పటికి  3693* శ్రమదాన పండుగలు జరుపుకొన్న కార్యకర్తలకు క్రిస్మసేమిటీ - గణచతుర్ధి- ఫణిచతుర్ధి-సంక్రాంతి-వంటి ఏపండుగలైతే ఏమి? తమ ఊరంతా సౌకర్యవంతంగా-స్వస్తంగా-ఆహ్లాదంగా-ఆరోగ్యంగా-ఆదర్శంగా నిలిచే దాక వాళ్ల శ్రమ వేడుక ఆగదు!

               ఊరునుద్ధరిస్తున్నామనే గొప్పకు కాక-పరుల మెప్పులకు కాక-“ఇదుగో, ఈ వేకువ 4.20-6.20 నడుమ 35 మందితో-ఇళ్లకు 3 కిలోమీటర్ల దూరాన-ఈ ప్లాస్టిక్ చెత్తలు ఏరాం, ఇన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లను ప్రోగేశాం, వందలాది పిచ్చి మొక్కల్ని నిర్మూలించాం, అదుగో- పెద్ద ట్రాక్టరు నిండా రహదారి వ్యర్ధాల్ని నింపాం, నోరు తెరచి అడక్కుండానే వందలాది ప్రయాణికుల ఆహ్లాదకర రాక పోకలకు కారకులమయ్యాం....” అనే చిన్నపాటి మంచి స్వార్ధం (?) తో జరిగే కార్యక్రమం-కొందరైనా యువకులూ, విద్యార్థులూ వచ్చిపాల్గొంటే- ఇదిక నిరంతర జాజ్వల్య మానమే!

               “ఈ వేకువ ఎన్ని గజాల అవనిగడ్డ రహదారిని శుభ్ర-సుందరీకరించారు, వంటి లెక్కలు కాదు-పుష్కర కాలపుకార్యకర్తల అరుదైన కృషిలో పాతిక వేలమందిలో ఈ కొద్దిమందేనా పాల్గొనేది? మనకు జీవన పద్ధతులు నేర్పిన సమాజానికి మనం తిరిగి ఇచ్చేదేమీ లేదా?....”  వంటి ప్రశ్నలిప్పుడు కావాలి!

               నేటి రహదారి శ్రమ స్థలంలో 4 క్రొత్త మొఖూలు కన్పించాయి - ఇద్దరు డాక్టర్లు (ఒంగోలు), రాష్ట్ర పించనుదారుల అధ్యక్షుడూ, వారి శ్రీమతీ. డాక్టర్లైనా, ఉన్నతులైనా, గృహిణులైనా-సుదూర ప్రాంతం నుండి వచ్చినవారైనా-అదేమిటో చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల పనులు చూస్తూ ఊరుకోలేరు-మూడ్ మారిపోతుంది-చీపుళ్లందుకొంటారు!

               అంతటితో ఆగక-ఉదయినీ పురుషోత్తములైతే ‘మనకోసం మనం’ ట్రస్టుకు ఏకంగా లక్ష రూకల చెక్కు ఇచ్చేశారు, ఉషా వెంకటేశ్వరులైతే వెరైటీ చందాగా-అక్కడ ఎందరు పెన్షనరు కార్యకర్తలుంటే-అన్ని వేలు ప్రకటించారు!

               అమరుల ప్రాంగణం మారు మ్రోగునట్లుగా నినాదాలను ప్రకటించినది మాలెంపాటి అంజయ్య గారు,

               వీళ్ళే కాదు, పల్నాటి  ప్రేమ్ తరుణ్  పుట్టిన రోజు సందర్భంగా 1000/- రూపాయలు కూడా మేనేజింగ్ ట్రస్టీ కి ముట్టినవి.

               రహదారి సేవల పిదప ఒంగోలు, కొండపాటూరు అతిధులు గతంలో తాము నాటిన మొక్కల పరిశీలనకై ఊరంతా తిరిగి చూసి మళ్ళీ మొక్కలు నాటుతున్నారు. క్రింది ఫోటోలో డా. స్వాతి, డా. సందీప్  (పురుషోత్తం - ఉదయినీ గార్ల కుమార్తె, అల్లుడు)  మరొక క్రొత్త మొక్కని నాటుతున్న దృశ్యాన్ని చూడండి. (అసలీ డాక్టర్లే కాదు - డజన్ల కొద్దీ పెద్ద పెద్ద సామాజిక వైద్యుల్ని అచ్చు వేసి దేశం మీదకి వదలినది 87 ఏళ్ల పెద్ద డాక్టరు నల్లూరి రంగారావు గారు!)     

               ఈ 35 గురు కాక-12.00 గంటలకు NH216 ఫంక్షన్ హాలు వద్ద జాస్తి వారి పిల్లల పంచల పండుగ కోసం 5-6 గురు స్వచ్ఛ కార్యకర్తలు పనిచేస్తున్నారు.

               ఇలాంటి పని సంస్కృతీ, శ్రమదాన వాతావరణమూ ఈ వాట్సప్-ముఖ పుస్తక పఠితలకు నచ్చిందా?

               10 గంటల తర్వాత జాస్తి ప్రసాదు-లక్షీరాణుల ఆతిధ్యానికీ,

               రేపటి వేకువ అమర వీరస్థూప ప్రాంత సుందరీకరణకూ కార్యకర్తలందరికీ ఆహ్వానం!

               మనో బలము కావలదా

మనో బలము కావలదా – మల మూత్ర స్థలాలో

వేకువ సేవలు చేయగ? స్త్రీలు కూడ శ్మశానమున

ప్రవేశించి రాత్రి పూట పలు సేవల ధైర్యానికి?

ఈ సామాజిక బాధ్యత కెవరు విలువ గట్టగలరు?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    25.12.2025