3694* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

3700 రోజులకు చేరువగా స్వచ్ఛ గ్రామ సేవలు - @3694*

               అనగా శుక్రవారం వేకువ 4.20-6.18 సమయాల నడుమ – చల్లపల్లికి 3 కిలోమీటర్ల దూరంగా - అవనిగడ్డ రహదారిలో- పదేళ్ల హారిక, హైదరాబాద్ నుండి TCS ఉన్నతోద్యోగి వల్లభనేని కుమార్ సహా మొత్తం 28 మంది సుందరీకరణ ప్రయత్నాలు!

               వీరిలో ఇద్దరు నర్సులు ఆస్పత్రి అత్యవసర వైద్య సేవల నిమిత్తం ముందుగా నిష్క్రమించగా, అరేడుగురు కోళ్లఫారం వద్ద శ్రమిస్తుండగా, మిగిలిన 20 మందికీ అమరస్థూప ప్రాంగణంలోనే పనులు...

               పనులంటే ఏదో చీపుళ్ళతో పైపైన ఊడ్వడం, మొక్కలకు నీరు పెట్టడం వంటి తేలిక పనులు కాదు, అంత చలిలోనూ అలసి, చెమట కారే పలుగు - పారల - గట్టి - మట్టి పనులు! మట్టిని తిరగేస్తేనే వేళ్లతో సహా గడ్డీ, పిచ్చి మొక్కలూ చాలకాలం కనిపించవనీ, అప్పుడు మరిన్ని పూలమొక్కలు పెంచి, ప్రాణత్యాగధనులైన కమ్యూనిస్టు మృత వీరులకు ఘన నివాళి ఔతుందనీ కార్యకర్తల ఉద్దేశ్యమట!

               ఈ స్వచ్ఛ కార్యకర్తల పనులేవైనా చప్పగా జరుగవు కదా! దూరం నుండి మైకులో చైతన్య గీతాలు వినిపిస్తుంటాయి, ఇద్దరివో-ముగ్గురివో కూనిరాగాలుంటాయి, కోడూరి వారి గట్టి అదలింపులూ ఉంటాయి, ఇంత సందడి మధ్య - ఇన్ని సామూహిక నిస్వార్థ సేవల నడుమ ఇంకా బోరుకొట్టడమూ, అలసిపోవడమూ ఎందుకుంటాయి? మురికి పనులు సైతం ఆనందిస్తూ చేయడం ఈ స్వచ్ఛ చల్లపల్లిలోనే సాధ్యమేమో!

               2 గంటల శ్రమదానంలో నేను ఎక్కువగా గమనించేది చివరి 20 నిముషాల చెత్త లోడింగు కార్యక్రమాన్నే. ఈరోజు మాత్రం అమర ప్రాంగణంలోని పని సన్నివేశాలే ఎక్కువగా ఆకర్షించాయి!

               బోగన్ విలియా పూల చెట్టు నేపధ్యంగా జరిగిన సమీక్షా సభలో:

1)         DRK గారు నేటి సేవల విశ్లేషణా,

2)         జాస్తి ప్రసాదు - లక్ష్మీరాణి, మౌనికా దంపతులు నిన్న NH216 ఫంక్షన్ హాలులో అద్భుతంగా నిర్వహించిన హరిత వేడుకా,

3)         రోడ్ల మీద, డ్రైన్లలో చెత్తను విసిరే మన ప్రజలనూ, విదేశాల్లో వారి పరిశుభ్రతా చర్యలతో నాగేంద్రకుమార్ తెచ్చిన పోలికా,

4)         నేటి నుండి అప్పుడప్పుడూ స్వచ్ఛ కార్యకర్తల మీద నాదెళ్ల సురేష్ వ్రాయబోతున్న చమత్కారాలూ ప్రస్తావనకొచ్చాయి.

               రేపటి మన కార్యక్రమం కూడ అవనిగడ్డ మార్గంలోనే అని నిర్ణయించారు!

          సప్తతి వర్షాల మనిషి

సప్తతి వర్షాల మనిషి శత కిలోల కోడూరు

హాయిగ ఇంట్లో పండక స్వచ్చోద్యమమతని కేల?

చొక్కా తడిసి – చెమట కార్చి  శ్రమించడం సరదానా?

ఈ వయసున సామాజిక బాధ్యతింత అవసరమా?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    26.12.2025