3695* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

గ్రామ బాధ్యతలలో మరొక స్థిరవారం (27.12.25 ) – @3695 *

               నెరవేరిన బాధ్యతలు 33 మందివి; పని చోటు గ్రామంలో కాక దూరంగా అవనిగడ్డ బాట లోనిది; సమయం 4.18 - 6.33 కు మధ్యస్తం; ఫలితం ప్రధానంగా అమర వీర స్థూప ప్రాంగణం, రోడ్డు పొడవునా ½  కిలో మీటరు దాక స్వచ్ఛ సుందరం; నిష్కామ కర్మ వీరులకు ఫలితంతో పెద్దగా పని లేదు గాని కొంత సంతృప్తి దాయకమూ, స్ఫూర్తి మంతమూ !

ఇంకాస్త వివరంగా చెప్పాలను కొంటే:

- 20 మంది కార్యకర్తలది కొంత కష్టంతో కూడుకొన్న శ్రమదానమే. గునపాలతో మట్టి పెళ్లలు విరగదీయటమూ, పారలతో పొడి కొట్టడమూ, గడ్డి పరకల్ని వేళ్లనీ ఏరడమూ

- సగం మందిది మరో కొత్త పని- మట్టి నుండి రాతి ముక్కల్ని ఏరి, డిప్పల కెత్తి, బైటి ట్రాక్టరులో నింపే పని.

- మరి ఆ రాళ్లేం  కావాలి?  అంటే- ఏ వ్యర్ధమూ నిరుపయోగం కానట్లే ఈ రాతి ముక్కల్ని సైతం అక్కడికి దూరంగా రోడ్డు మార్జిన్ గుంటలో నింపి, దాని భద్రతకు ఉపయోగించారు!

               ఈ పనుల కోసం మహిళామతల్లులు పలుగుల్తో త్రవ్వడాన్ని వాట్సప్ చిత్రాల్లో చూడండి.

               అమర స్థూపం  దుమ్ము కొట్టుకుపోతే తుడుస్తున్న స్వచ్ఛ కార్యకర్తల్ని గమనించండి. ప్రహరీని, తదుపరి భాగాన్నీ చీపురుతో ఊడుస్తున్న సీనియర్ వైద్యుడెవరో గుర్తించండి.

               ఈ కార్యకర్తలవి తిక్క పనులు కావనీ, నేటి చల్లపల్లి కార్యకర్తల శ్రమదాన సన్నివేశాలు రేపటి రాష్ట్ర- దేశ వ్యాప్త లక్షలాది గ్రామాలకు అవశ్యాచరణీయాలనీ తెలుసుకోండి!

               అరుగో- రహదారిని మళ్లీమళ్లీ ఊడుస్తున్న- కాగితాలూ, ప్లాస్టిక్ తుక్కులూ, సీసాలూ, కప్పులూ, గోనె సంచుల్లో కెత్తుతున్న తక్కిన కార్యకర్తల్ని ఆదర్శంగా తీసుకోండి!  వీలైతే రేపటి నుండి వచ్చి  శ్రమదానంలో పాల్గొనండి!

               ఆస్పత్రి సిబ్బందికి బాస్ అనదగిన లక్ష్మి చేసిన నినాదాత్మక ప్రతిజ్ఞలు నచ్చితేనూ,

               ప్రతి ఆదివారం ఉదయం ఎవరి వీధిలోని కాగితపు - ప్లాస్టిక్ సరుకుల్ని వాళ్లం పావుగంట పాటు ఏరి, ఇతర గామస్తులకాదర్శంగా నిలుద్దాం అనే DRK వైద్యుని సూచననూ పాటించండి!

               చిల్లలవాగు గట్టు శ్మశానానికి విజయేంద్ర ప్రసాద్ గారి MP నిధుల నుండి సహకారంతో ప్రహరీ నిర్మాణమూ, హిందూ శ్మశానవాటికకు 1 వ వార్డు ప్రక్కగా రోడ్డు నిర్మాణానికి పనులు జరుగుతున్నవని కూడా గమనించండి.   

               చివరగా - రేపటి మన శ్రమదానం కూడ అవనిగడ్డ బాటకే పరిమిత మని గుర్తుంచు కొనండి!

        రాబోయే కాలములో కాబోయే..

రాబోయే కాలములో కాబోయే తహసీల్దార్

కడుపు చల్ల కదలకుండ ఉద్యోగం చేసుకోక

తూము బురద లాగుతాడు తూము వెంకటేశ్వరుడు

ఈ సామాజిక బాధ్యుని కెంత ఖర్మ పట్టినదో!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    27.12.2025