3706* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

స్వచ్ఛసుందరీకరణలో మరొక రోజు - @ 3706*

ఈ వేల పని దినాల సంఖ్య అలా.. అలా.. పెరిగి పోతూనే ఉంటుందనీ, గ్రామ వీధుల - రహదార్ల అపవిత్రీకులూ, బాధ్యతా రహితులూ పుష్కరకాలం పిదప కూడ తమ అలవాటు మానుకోరనీ ఈ బుధవారం (7.1.26)  కూడ ఋజువౌతూనే ఉన్నది! వాళ్లదా - ఈ మొండి స్వచ్ఛ కార్యకర్తలదా- అంతిమ విజయం ఎవరిదో త్వరలో తేలవలసి ఉంది!

ఇలా వ్రాయటానికి కారణంబేమనగా:

- 40 రోజుల నుండీ మంచనక, చలి గాలులనక కార్యకర్తలీ అవనిగడ్డ బాట 1 ½  కిలో మీటర్లలో తమ చెమటను ధార పోస్తూనే ఉన్నారు,

-  కుడి వైపు బాగుచేసి, ఎడమ మార్జిన్ నూ, డ్రైనునూ బాగు చేసేంతలోనే మళ్లీ కుడి ప్రక్కన చెత్త భీభత్సాలు!

-‘మంత్రసాని పనికి దిగాక...’ అనే సామెత ప్రకారం వాలంటీర్లు మరొక మారు కుడి దిక్కునూ శుభ్రపరుచుకు పోవడం వల్లే ఈ రహదారి శుభ్ర సుందరీకరణలో కొంత కాల విలంబం!

మరి - చుట్టూ మిగిలిన 8 రోడ్ల సంగతేమిటి? ఊరి ముఖ్య వీధులు కూడ తమను బాగు చేయండని కార్యకర్తల్ని ఆహ్వానిస్తున్నాయే-వాటి మొర ఆలకించాలా - వద్దా?

అందుకే గదా - ఈ స్వచ్చ సుందరోద్యమం గ్రామస్తుల్ని ఇకనైనా “రారండి” అని అభ్యర్థిస్తున్నది! "ఊరి సంగతి మాకెందుకు? వీధుల శుభ్రత కార్యకర్తలే చూసుకోండి-  పంచాయతీ వాళ్లే పట్టించుకోండి- మా సొంత పన్లు మాకు చాలు” అనుకొనే వాళ్ళకివే మా వందనాలు !

ఈ వేకువ కూడ:

చెత్త ఏరుడు ఆగలేదు - బాట మార్జిన్ల గడ్డి చెక్కుడు తగ్గనేలేదు – గొంతు బొంగురుపోయి, నడుం బాధిస్తున్న స్వచ్చ వైద్యుని రహదారి సేవలు ఆగలేదు!

4.16 AM – 6.18 AM ల మధ్య 31 మంది సామాజిక బాధ్యతలు సజావుగా నేరవేరినవి.

6.30 కు ఈ పని దినాన్ని సమీక్షించవలసిన DRK ముందే నిష్క్రమించగా- భోగాది వాసు నినాదాల పిదప -  కార్యకర్తలే సమీక్షించుకొని,

      రేపు కూడ ఉరిమి వారి వడ్లమిల్లు వద్దే కలుద్దామనుకొన్నారు!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    07.01.2026.

 

                                             కొన్ని పోలికలు.

అక్కడ హిమాలయాల్లో దేశ భద్రతకోసం వీర సైనికులు!

ఇక్కడి భీకరమైన మంచులో “స్వచ్చ- హరిత- సుందర చల్లపల్లి” కోసం స్వచ్చ సైనికులు!

కోనసీమ కొమరాడను కలుషితం చేస్తూ ‘గ్లాస్ బ్లోఅవుట్’ ఒక వైపు!

హరిత – పరిశుభ్రతలు  నిలిపి, భూమి ఉపరితలాన్ని రక్షిస్తూ చల్లపల్లి కార్యకర్తలొక వైపు!     చమురు నిక్షేపాల దోపిడి కోసం వెనిజులా అధ్యక్షుడిని బంధించే ట్రంపు లొక ప్రక్క! 

చేతి చమురు వదలించు కొంటూ శ్రమను పెట్టుబడిగా పర్యావరణ భద్రతకై చల్లపల్లి ఒక ప్రక్క!                                       

సమున్నత లక్ష్యం మరువక - మీరుతున్న వయస్సులను మరచి దశాబ్దాలుగా శ్రమ యజ్ఞం చేస్తున్న మిమ్ము ఎంతగా- ఎలా- అభినందించను?

- బెల్లంకొండ వీరాంజనేయులు,

- రిటైర్డ్ ప్రిన్సి పల్

-చిలకలూరిపేట,