3708* వ రోజు .......

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

32 మందితో విజయవంతమైన 3708* వ శ్రమదానం!

               పై 32 సంఖ్యలో SRYSP కళాశాల వద్ద శుభ్రపరచిన JP &DP ప్రసాదుల ద్వయం ఈ (శుక్రవారం-9-1-26) నాటి గ్రూపు ఫోటోలో కనిపించదు. వాళ్లకు బదులు ఊళ్లోకెల్లా సీనియర్ మోస్ట్ వైద్యుడు దుగ్గిరాల శివప్రసాదు గారు వచ్చి - 88 ఏళ్ల వయసులోనూ తడబాటు లేకుండ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు మ్రోగించారు!

               అసలీ వేకువ 4:18 & 6.18 నడుమ మంచు మందగించింది గాని - చలి పెరిగింది. ఐనా – గ్రామ సర్పంచమ్మతో సహా ఏ కార్యకర్తా బాధ్యతా నిర్వహణలో వెనుకంజ వేయలేదు.

               ఈ స్వచ్ఛంద సామూహిక శ్రమ జరిగినది అవనిగడ్డ రోడ్డులోని - ప్రభాకర ధాన్యం మిల్లు - స్వచ్ఛ సుందర టాయిలెట్ల నడుమ.

               “మరి ఆ 100 గజాల రహదారిలోనే ఇందరి శ్రమదానమా?” అని సందేహించవద్దు! ఎవరి బాధ్యతను వాళ్లు, ఎవరి పద్దతిలోవాళ్లు గంటల తరబడీ దీక్షగా చేసుకుపోయే కార్యకర్తలకు ఆ వివరాలు తెలియవు గాని – ప్రత్యాంగుళాన్నీ పట్టి పట్టి శుభ్రపరుస్తూ, చిన్న పేపరు ముక్కల్నీ వదలక ఏరుతూ, కాలుష్యాలను 4 భాగాలుగా విడగొట్టి, బాటను సుందరీకరించడమెంత కష్టమో..... చూసే నాబోటి వాళ్ళకే బాగా తెలుస్తుంది!

               డ్రైను అంచున గంటన్నర పాటు కూర్చొని శుభ్రపరచిన ఒకానొక విశ్రాంత ఇంజనీరు శ్రమను చూసినా స్వచ్ఛ చల్లపల్లి పనులెట్టివో అర్థమైపోతుంది!

               స్ఫూర్తి సంగతలా ఉంచి, పని పరిమాణం గ్రహించాలంటే - 2 గజాలెత్తున ట్రాక్టరులో క్రిక్కిరిసిన కాలుష్యాలను చూడండి!

               రోజూ నేను వ్రాస్తున్నవి అభూత కల్పనలో - అర్థ సత్యాలో అనిపిస్తే ఏ గామ్రస్తులైనా, ఏ వేకువనైనా పని స్థలానికొచ్చి ప్రత్యక్షంగా తిలకించవచ్చు!

               11-12 ఏళ్ల ఈ గ్రామ మెరుగుదల కృషి ఎంత పవిత్ర కార్యమో అప్పుడర్ధమౌతుంది!

               6:05 కు పబ్లిక్ టాయిలెట్ కడ జరిగిన సమీక్షా సభలో ఒక స్వచ్ఛ వైద్యుడు మరొక సీనియర్ డాక్టర్ నుండి సంవత్సరానికి గాను 12 చెక్కులను నెలవారీ చందాలుగా స్వీకరించారు!

               రేపటి స్వచ్ఛ కార్యక్రమం కోసం నాగాయలంక రోడ్డులోని పబ్లిక్ టాయిలెట్స్ వద్ద కలుసుకుందాం.  

               ఎల్లుండి 30 మంది పర్యాటక అతిథులు పాల్గొనే శ్రమవేడుకకు అవనిగడ్డ రహదారిలోని పాగోలు రోడ్డు ప్రాంతమే ఆతిథ్యమీయ నుంది!

               పదుల సంఖ్యలో అట్టి ధన్యులు

పరమ నిష్టగ గ్రామసేవకు, ప్రజోద్ధరణకు నిలుచు మాన్యుడు

ఒక్కడంటే ఒక్కడున్నా ఊరు సాంతం మారు నందురు

స్వచ్ఛ సుందర చల్లపల్లికి పదుల సంఖ్యలో అట్టి ధన్యులు!

నందనంగా మారకుండా ఉండునా ఈ మహిత గ్రామం?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    09.01.2026