3712* వ రోజు .......

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

అందమైన వీధికి మరికొంత శుభ్ర సౌందర్యసాధన! @3712*

               ఆ వీధి గంగులవారిపాలెం వీధని చెప్పనవసరం లేదు, 2026 వ సంవత్సరపు భోగి సంబరాలకు ముందటి - మంగళవారం (12-1-26) వేకువ 4:10 కే బజారు సౌందర్యారాధన మొదలయింది. 6:22 కి కాబోలు - ఆ 44 మంది శ్రమదాన సంరంభం ముగిసింది.

               2013 కు ముందటి గంగులవారిపాలెం రోడ్డు కథ వేఱు – స్ధానికులూ, స్వచ్ఛ కార్యకర్తలూ కంటికి రెప్పలా కాపాడుకొస్తున్న ఈ పన్నెండేళ్ల హరిత - శుభ్ర - సౌందర్య వైభవం వేఱు!

               పద్మావతి ఆస్పత్రి ఎదురుగా - తాతినేని వారు తరలించిన నర్సరీ పిదప SRYSP. కళాశాల ప్రహరీ వెలుపలి 25 సెంట్ల జాగాలోని నర్సరీ అవశేషాలతో ఈ వీధి అందాలకు ఏర్పడిన లోపం నేటి 50-60 పని గంటల శ్రమతో చాలవరకు సరిజేయబడింది. అసలీ నాటి స్వచ్ఛ కార్యకర్తల పనుల్ని రోజూ చూసే నాలాంటి వాళ్ళకు కాదు గాని, క్రొత్త వాళ్ళు గనుక చూస్తిరా –

               “ఇదేమి శ్రమదానం? ఇందరు పిల్లలు, పెద్దలు, గృహిణులు, ఉద్యోగ –

ఉద్యోగేతరులు, కాళ్లు తడబడే వృద్ధులు ఈ గతుకుల చీకటి చోట - ఇంత సంతోషంగా పని చేస్తారేమబ్బా!” అని తికమక పడడం ఖాయం! తమ ఉన్నత హోదాలు మరచి, గడ్డి పీకే - మట్టి ఊడ్చే - బలవంతాన టార్పాలిన్ పట్టల్ని గుంజే - 2 ట్రాక్టర్ల వ్యర్ధాల్ని ఒక్క ట్రాక్టర్లో కుక్కే..... బరువు మురికి పనులిన్ని వేల రోజులగా చేయడమెలా సాధ్యం?” అని ఆశ్చర్యపడడం నిజం!

               మరి - ఏ శ్రమా లేకుండానే – “హాంఫట్, అబ్రకదబ్ర” లాంటి మాయలతో ఇంత

పెద్ద గ్రామం క్రమక్రమక్రమంగా శోభాయమానంగా మారుతున్నదా? ఈ 30 వేల చెట్లూ, అద్భుతమైన శ్మశానాలూ, అందమైన రహదార్లూ ఆకాశం నుండి దిగివచ్చాయా? అందుకే “శ్రమయేవ జయతే, శ్రమమూలమిదం జగత్” వంటి నానుడు లేర్పడేది!

               6.35 కు - శ్రమదానానంతర ఉత్సాహం మాత్రం తగ్గిందా? సుమారు 60 మంది పద్మాభిరామం ఎదుట తగిరిశ రమ్య గారి స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలను పునరుద్ఘాటించగా-కార్యకర్తల కష్టాన్ని DRK గారు చెప్పగా –

               తన మనుమరాలి ప్రథమ జన్మదినం గుర్తుగా మల్లంపాటి ప్రేమానంద్ గారు కార్యకర్తలకు ఉపాహారములూ, మనకోసం మనం ట్రస్టుకు 10,000/- విరాళమూ ప్రకటించగా –

               రేపటి భోగి ఉత్సవాలకు కడియాల సురేష్ కుటుంబీకులు కార్యకర్తల్ని ఆహ్వానించగా-

               నేటి శ్రమదాన పరిసమాప్తి!

             ఆ సందడి- హడావిడీ

అదుగో మన కోట పద్మ- అసలామె ఉపాధ్యాయిని

స్వచ్చ కృషి సందర్భమైనా - స్వచ్ఛ ఫంక్షన్ సమయమైనా

ఆ సందడి-హడావిడీ అనన్య సాధ్యం అనుట సత్యము

(అందరూ అనుకొనేమాట - ఆమె బుర్రే పాదరసమట)!

- నల్లూరి రామారావు

ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

13.01.2026