పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?
పెద్ద పండగ నాటి కొద్దిమంది గ్రామ సేవానందం-@3714*
15-1-26 గురువారం నాడు చాలమంది గ్రామస్తుల్లో సంక్రాంతి ఆనంద తరంగాలు; గ్రామ పౌరుల్ని ఆహ్లాద ఆరోగ్యాల సౌకర్యాలతో ఆశీర్వదిస్తూ కనీసం 28+ ఒక్కరి వీధి బాధ్యతలు! ఈ పడమటి వీధి పరిశుభ్రతానందంలో పాలు పంచుకొన్న కనీసం ఇద్దరు స్థానికులు!
ఒక ప్రక్క దట్టమైన హిమపాతం - మరో వంక వీధి మలుపుల వద్ద తగ్గని వాహనాల వేగం - ఐనా జాగ్రత్తగా ఈ పాతిక మంది కార్యకర్తల వీధి పారిశుద్ధ్యం!
రోడ్డు మార్జిన్లలో ప్రోగు చేసిన రాతి ముక్కలు, దుమ్ము, పెంకులు 50 గజాల దూరంగా డిప్పలతో మోసి - పాగోలు బజారు ఎదుట - అంబేత్కర్ భారీ ఫ్లెక్సీ దగ్గర తారు రోడ్డుకు రక్షణగా పనికొచ్చాయి.
గోకుడు పారలతో - పారలతో చెక్కిన గడ్డి వల్ల వీధి మరింత విశాలంగా, స్థానిక మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులతో ఆ 150 గజాల వీధి 6.30 కు ఎంత అందంగా తయారయిందో చూడండి! ఆమాట కొస్తే- ఇక్కడి నుండి కాసానగరం వైపు 2 కిలోమీటర్ల అవనిగడ్డ రహదారీ ఎంత హరిత సుందరంగా కనిపిస్తున్నది ?
వీటన్నిటికీ మూలం ఒక్కటే ఒక్కటి- " మేమేకాదు - మా ఇల్లూ మా వీధే కాదు- మా ఊరంతా కళకళలాడుతూ ఉండాలి" అనుకొనే స్వచ్చ కార్యకర్తల ఆలోచన- ఆచరణ!
" ఇంట్లో ముడుచుకు తొంగుండే బదులు వేకువనే ఒకటి- రెండు గంటలు ఊరి కోసం శ్రమిస్తే పోయేదేమిటి?- మన అనారోగ్యాలు తప్ప, బద్ధకాలు తప్ప" అనే తత్త్వ చింతన!
మరి - ఇలాంటి 12 ఏళ్ల సదాచరణే కదూ - చల్లపల్లిని దేశంలో చాల విషయాల్లో ఆదర్శంగా నిలుపుతున్నది?
ఈ స్వచ్చ కార్యకర్తల శ్రమ త్యాగమే కదూ – విజయవాడ నుండి 110 కిలోమీటర్లు ప్రయాణం చేయించి, వేకువనే గోపాళం శివన్నారాయణ వైద్యుడిని రప్పించింది?
పోతురాజు గుడి సాక్షిగా నేటి సమావేశంలో:
- డాక్టర్ గోపాళం గారి నందీ- పందుల, ఆవూ – పాముల క్రొత్త నిర్వచనాలు,
స్వచ్చోద్యమానికి అతని 5000/- విరాళమూ,
-Dr. గోపాల కృష్ణయ్యగారి 2000/- చందా,
- కుమారుని పుట్పటినరోజు సందర్భంగా పల్నాటి అన్నపూర్ణా భాస్కరుల 1000/- సహకారమూ,
"రేపటి గ్రామ బాధ్యత కూడ పడమటి వీధిలో " అనే నిర్ణయమూ!
చేయవలసినది మరువకుందురు
చేసిన శ్రమలకు సంతోషించుచుచేయవలసినది మరువకుందురు!
ఊరు పెద్దదని, ఎంత చేసినా ఉండును మిగిలే అని గ్రహింతురు!
ఎన్నటికైనా గ్రామస్తుల సహకారం తప్పక లభించగలదని,
ఊరు మరింతగ బాగు పడుననే కార్యకర్తలా లోచిస్తుందురు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
15.01.2026