పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?
కనుమ నాటి వీధి పారిశుద్ధ్యం పడమటి వీధిలోనే @3715*
ఈ శుక్రవారపు (16-1-26) వేకువ 4:20 నుండి 6:27 దాకా అటు పోతురాజు గుడి మొదలు బస్టాండు దిశగా 150 గజాల పడమటి బజారు అపరిశుభ్రతా నివారణకు పోరాడిన కార్యకర్తలు 27 మంది. అటు చలిమంచుతోనూ, ఇటు గ్రామ ముఖ్యవీధి కాలుష్యంతోనూ వాళ్లది ద్విముఖ పోరాటం.
ఈ సమరంలో కార్యకర్తలుగా మారిన స్థానికులు ఇద్దరు, ప్రేక్షక పాత్రలు డజన్ల మందివి. ఊరి పరిశుభ్రతే -తద్ద్వారా ప్రజారోగ్యమే - ధ్యేయంగా శ్రమించే కార్యకర్తలకు తమ దైనందిన లక్ష్యం నెరవేరిన ప్రతి రోజూ పండగే కావచ్చు గాని - గ్రామ సామాన్య ప్రజలకు భోగి, మకర సంక్రమణ, కనుమలు ఏడాదిలో పెద్ద పర్వదినాలు గదా! వాళ్లు తమ వీధి బాగుదలలో పాల్గొనడం కాస్త కష్టమే గదా!
మరి స్వచ్ఛ కార్యకర్తల వీధి సేవలంటారా - వాటికేం లోటు? రోడ్డు మార్జిన్ పల్లంగా ఉండి, బరువు బళ్ల వల్ల విరిగిపడే ఛాన్సు ఉన్నా, ఏ మురుగు కాల్వయినా అమర్యాదగా ప్రవర్తిస్తున్నా - అంటే ప్రక్కలకు పొర్లిపారుతున్నా, నల్లని తారు రోడ్డుకు కళంకంగా ఇసుకా, దుమ్ము కనిపించినా, బాట ప్రక్కల గడ్డీ, పిచ్చి మొక్కలూ తలెత్తినా, స్వచ్ఛ కార్యకర్తల సహనం నశిస్తుంది! వాటిని నిర్మూలించేదాకా నిద్ర కరువౌతుంది!
ఈ వేకువ 2 గంటల సమయమూ అంతే! నేటి పాతికకు పైగా వాలంటీర్ల ప్రయత్నం 2 రకాలుగా అనిపించింది. 8-10 మందేమో చీపుర్లతో ఊడ్చుకొంటూ దాదాపు కోట ద్వారం దాకా వెళ్లారు. మిగిలిన 16 మందివి బరువు పనులూ, మురుగు పనులూ! అనగా - రోడ్డు మార్జిన్ల పల్లాలను సరిజేసేవన్నమాట!
వయోభారం మోస్తూ కూడా వీధి సేవలు మానని గోపాలకృష్ణ వైద్యుడే నేటి గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదకర్త!
జిల్లా పాలకుడైయుండీ, సాదా సీదా సింపుల్ మనిషిగా కనిపించే వ్యక్తి గురించి వివరించిన DRK డాక్టరే నేటి శ్రమదాన సమీక్షకుడు!
రేపటి స్వచ్ఛంద శ్రమదానానికి వాసు టీ దుకాణం (పడమటి వీధి) వద్ద కలుసుకోవాలనేదే కార్యకర్తల నిర్ణయం!
నిండు నమ్మకము కార్యకర్తలది!
సానుకూలమగు భావజాలమున- ఆశావహ దృక్పథము తోడుగా
దశాబ్దమైనా – పుష్కరమైనా తమ గ్రామస్తుల అండదండతో
రాష్ట్రములో తమ గ్రామమ్మును కడు స్వచ్చ- సుందరతకుదాహరణగా
నిలుపగలమమనీ-గెలువగలమనీ నిండు నమ్మకము కార్యకర్తలది!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
16.01.2026