కనువిందు చేస్తున్న నాగాయలంక రహదారి అందాలు.....

కనువిందు చేస్తున్న నాగాయలంక రహదారి అందాలు.  

అది ఇప్పటి ఇరుకు రోడ్లలా కాదు - బండ్రేవు కోడు కాల్వ వంతెన మొదలు 1 ½ కిలోమీటరు నిడివీ, 50 అడుగుల వెడల్పూ, ఇరువైపులా నీళ్ళపారుదలా, డివైడరు లైన్ల మధ్య నిగనిగలాడుతూ తారురోడ్డు, రెండు మార్లిన్ల వెలుపల పచ్చని భారీ వృక్షాలూ, వాటి మధ్య వివిధ పుష్ప సౌందర్యమూ....!

               వీటిలో వందలకొద్ది చెట్లూ, పూల మొక్కలూ అభినవ అశోక చక్రవర్తులైన స్వచ్ఛ కార్యకర్తలు నాటి పెంచినవే!

               ఊహించండి- నిత్యమూ వేలాదిగా బస్సుల – ద్వి, త్రిచక్ర వాహనాల- సైకిళ్ల- ఎడ్ల బండ్ల - రిక్షాల – కాలి నడకల ప్రజలు అలాంటి రహదారి గుండా వెళ్లునప్పటి ఆహ్లాదం ఏ స్థాయిలో ఉంటుందో!

               కాని – ఇంత మంచి రహదారికి మొన్నటి అక్టోబరు తుఫాను దిష్టి తగిలింది; సౌందర్య లాలస లేని, పర్యావరణ స్పృహ తెలియని కొద్దిమంది

- దూడల శవాలను తెచ్చి పడెయ్యడం

- సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లను చిమ్మడం వంటి అమాయక - అనాలోచిత చేష్టల వల్ల కాలుష్యం పెరిగింది; ఇక కిం కర్తవ్యమ్?

               అప్పుడిక ప్రకృతి మాత, పర్యావరణకాంత కూడ బలుక్కొని, తొమ్మిది వారాల క్రితం తమ ముద్దు బిడ్డలైన చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల్ని పురికొల్పారు. ఈ కార్యకర్తలు పైకలా కనిపిస్తారు గాని కష్టజీవులు, కళాకారులు, సామాజిక బాధ్యతా మూర్తులు! కాలం తమకు విసిరిన సవాలును స్వీకరించారు,

               60 రోజుల పాటు చలిలో- మంచులో ప్రతి వేకువా చెమటలు చిందించారు, పడిన చెట్లను సరిజేశారు, ఒరిగిన పూల మొక్కల్ని నిలబెట్టారు, రోజూ 30-40-50 మంది!

ఇప్పుడా రహదారిలో :

               ప్లాస్టిక్ తుక్కు లేదు, ఆకులూ-పుల్లలూ లేవు, విరిగి -ఎండిపోయి వ్రేలాడే కొమ్మల్లేవు. పనిలో పనిగా అమర వీరుల స్థూపాన్నీ స్వచ్ఛ- శుభ్ర - సుందరీకరించారు ! “రహదారి సౌందర్యమంటే ఇదీ” అని నిరూపించారు!

               కొన్ని చోట్ల రోడ్ల అంచులు ఎత్తుగా ఉండి, ద్విచక్రవాహనాలు పడిపోయే- రోడ్డు విరిగి పోయే ప్రమాద నివారణకై 20-25 వేల సొంత ఖర్చుతో- శ్రమతో బరంతులు పరచి, దూర దృష్టిని చాటుకొన్నారు!

               పురాణ కాలాల్లో “లోకాః సమస్తాః సుఖినోభవంతు...” అనే ఆశయం కోసం తపస్సులు చేసిన మహర్షులు గుర్తొస్తున్నారు ఈ 60 రోజుల స్వచ్ఛ కార్యకర్తల రహదారి సేవలను చూస్తుంటే!

- నల్లూరి రామారావు ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త 12.01.2026