3716* వ రోజు ......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

3716* వ శ్రమదానం (జనవరి17-శనివారం) చూస్తుంటే....!

               “అరెరే! పాతిక వేల జనసంఖ్యాక గ్రామ వీధి సేవకు ఈ 32 మందేనా పూనుకొన్నది?”  అనీ;

               “ఈ కిలోమీటరు రహదారి ప్రాంతం నుండి స్థానికులు ఇద్దరేనా స్వచ్చ కార్యకర్తలకు సహకరించేది?” అనీ;

               “పన్నెండేళ్ల సుదీర్ఘ గ్రామబాధ్యతల తరువాతైనా ఈ స్వచ్ఛోద్యమకారులకు విశ్రాంతి తీసుకొనే ఆలోచనే లేదా? అనీ;

               “విశాలమగు రోడ్డు ఊడ్చి, దుమ్మూ – ధూళీ డిప్పలకెత్తింది చాలక – బడ్డీ కొట్ల, దేవాలయాల, టీ అంగళ్ల చాటు మాటు మూల మూలలూ వెదకి వెదకి, అంత క్షుణ్ణంగా వీధిని సుందరీకరించాలా? ఇందుకే గదా ఒక్కో వీధి 20-30 రోజుల సమయం తీసుకొనేది?” అనీ;

               “అటు మంచు చెమ్మా-ఇటు వీధి దుమ్మూ కళ్లలో- ముక్కుల్లో దూరుతున్నా ఎందుకీ మహిళలూ, ఐదారుగురు పురుషులూ అదే పనిగా 150 గజాల దూరం ఊడ్చుకొంటూ పోతారు?” అనీ... ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తేవి!

               ఈ వేకువ చెత్తబండి చోదకుడైన ఒక సీనియర్ వైద్యుడినీ, ఆ ట్రాక్టరులోకి ఎక్కి, నానా చెత్త వస్తువుల్ని సర్ది త్రొక్కుతున్న ఒక మాజీ పంతులమ్మనూ చూస్తుంటే ఒకప్పుడు జనబాహుళ్యం పాడుకొనే “పాండవ ఉద్యోగ” నాటకం (తిరుపతి వెంకట కవుల రచన) లోని

               “జెండా పైకపిరాజు, ముందు శిత వాజిశ్రేణియుంగూర్చి, నే

               దండంబున్ గొని తోలు స్యందనము మీదన్ నారి సారించుచున్

               గాండీవంబు ధరించి ఫల్గుణుడు మూకన్ చెండు చున్నప్పుడొ

               క్కండున్ నీమొర నాలకించడు కురుక్ష్మానాథ! సంధింపగన్”

అనే పద్యం గుర్తొచ్చింది. వీధి బాధ్యతల సందర్భానికి పద్యంతో అన్వయం చెప్పాలంటే:  

స్యందనం (రథం = చెత్తబండి) నడిపే కృష్ణ పరమాత్మ గ్రామ ప్రముఖ వైద్యుడు;

గాండీవం ధరించింది ట్రాక్టరెక్కిన మహిళ; రథం వెనక కాలుష్యం పనిబడుతున్న స్వచ్ఛ సైనికులు పాండవ సైన్యం, కురు సంతతి వీధి కాలుష్యాలు!

               సరే - ఈ నాటి కాలుష్యంపై యుద్ధాన్ని సమీక్షించినది Dr. డి.ఆర్.కె. ఐతే –

               రేపు వైశ్యాబజారులో తమ తండ్రి ఉడత్తు రామారావు గారి పెద్ద కర్మకు స్వచ్ఛ సైనికుల్ని పిలిచింది ఉడత్తు రామగోపాల్, నళినీ సోదరులు!

         రేపటి వీధి కాలుష్య యుద్ధం కూడ పడమటి బజారునందే!

              ఇనుపకుతిక రాజుగారు

అదొక మురుగ్గుంటైనా- అలవిగాని కలుపై నా

ఇనుపకుతిక రాజుగారు ఏ పనికీ  వెనకాడరు

స్వచ్చ సుందరోద్యమానికి దొరికిన ఒక ముత్యంవలె

ఏ రహదారి నీ వదలరు - ఎవ్వరినీ నొప్పించరు !

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    17.01.2026