పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
స్వచ్ఛ - సుందరోద్యమ మహాగ్రంథంలో – 12 వ అధ్యాయం, 3730* వ పేజీ!
అలనాటి మహాభారతంలో 18 పర్వాలు, లక్షశ్లోకాలు ఐతే - ఈ శనివారం (జనవరి మాసాంతం) వేకువ జామున శివరామపురం దాపున 45 గురు స్వార్ధరహిత శ్రామికులు రచించినది 3730* వ పుట!
ఈ రచన సుఖాసీనులై, భోజనానంతర తంబూల సేవనం మధ్య లిఖిస్తున్నది కాదు - రహదారి దుర్గంధాల మధ్య, చెత్తా చెదారాలను ఊడ్చేస్తూ, పొడవైన భారీ తాళవృక్షాల కాండాలను లాగుతూ, రోడ్డు గుంటలను, మార్జిన్లను సరిజేస్తూ, పిచ్చి కంపల్ని తుదముట్టిస్తూ, కలుపుల్ని దునుమాడుతున్న కాయకష్టమిది!
ఒకరు కాదు - ఇద్దరు చెత్త బండెక్కి 2 గజాలెత్తున తుక్కుల్ని త్రొక్కుతుండగా, ఏడెనమండుగురు చెత్త డిప్పలు రయ్ రయ్ మని విసరుతుండగా, (అందులో రామానగరం రాజు గారు సుదూరం నుండి విసిరిన డిప్ప గురితప్పి జారి ఒక పంచాయతి కార్యకర్త నెత్తిని తాకగా) 2 బళ్ల తుక్కు ఒకే ట్రాక్టర్ లో ఇమిడిన దృశ్యం!
శివరాత్రి తిరునాళ్లకు కళాకాంతులు లేని రహదారిలో మరొక 200 గజాలు శుభ్ర - సుందరంగా మారిన వైనం!
కళ్లేపల్లి తిరునాళ్లేమో గాని 15 రోజులు ముందే 4 ఊళ్ళ కార్యకర్తల సామాజిక స్ఫూర్తిదాయక కథనం! గత చరిత్రేమో గాని, ఒక ఆదర్శ అభ్యుదయ భావిచరిత్ర రూపొందుతున్న సన్నివేశం!
2 గంటల శ్రమానంతరం తరగని కార్యకర్తల ఉత్సాహమే అందుకు సాక్ష్యం! ఇంకా నిదర్శనం కావాలంటే - 6.45 కు ఈ శ్రామిక సమూహం అర్థకైవారంగా నిలబడి,
ఆస్పత్రి ఉద్యోగి ‘చల్లపల్లి ప్రశాంతి’ ఉద్వేగంతో పలికిన స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాలు చాలు, నందేటి శ్రీను శ్రమదానోద్యమ సరదా గీతాలాపనకు కార్యకర్తల చప్పట్లే చాలు,
కలెక్టరు గారితో నిన్నటి తన కలయిక సమయపు విశేషాలు వివరించి, నేటి వాలంటీర్ల శ్రమతో వచ్చిన శుభ్ర సౌందర్యాలను సమక్షిస్తూ Dr. DRK పొందుతున్న సంతోషమూ చాలు -
రేపటి వేకువ శ్రమదానం కూడ శివరామపుర రహదారిలోనట!
ప్రగతికి జయప్రదమా?-5
కార్యకర్తల చెమట చలువతొ ఊరి చుట్టూ దారులెన్నో
హరితవనమై, పుష్పమయమై, అందచందములావహిస్తే
ఒక్కరోజూ- ఒక్క పూటా- ఒక్క గంట శ్రమించకుండుట
సమాజ ప్రగతికి జయప్రదమా? సహేతుకమా? సమంజసమా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
31.01.2026