3732* వ రోజు ..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

2-2-26 - సోమవారపు పని మెలకువలు - @3732*

               ఆ పారిశుద్ధ్య పనిమెలకువలు 27 మందివి; అవి క్రొత్త శివరామపురం దగ్గరి పంట కాలువ దగ్గరున్న కళ్లేపల్లి మార్గానికి చెందినవి, 4:22-6:20 వేకువ సమయపు శ్రమలు.

               వారం రోజుల నాడు NH 216 వద్ద మొదలైన ఆ ప్రజాహ్లాదకర రహదారి సుందరీకరణ చర్యలు 10 రకాలు!

1) కత్తి వాడక నిపుణులైన ఆరేడుగురు రోడ్డు మార్జిన్ల గడ్డీ – పిచ్చి మొక్కల - ముళ్ళ తీగల ఖండనాలూ, పూల, నీడ చెట్ల కొమ్మల క్రమబద్ధీకరణలూ మొదలు పెడతారు;

2) వాళ్ళ వెంట - నరికేసిన తుక్కుల్ని దంతెలతో లాగి, ప్రోగులు పెట్టే పనికి ఇద్దరు పూనుకొంటారు;

3) పనిలో పనిగా ఈ ముఠా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తుక్కును విడగొడతారు;

4) ఎత్తైన చెట్ల కొమ్మలు కరెంటు, కేబుల్ తీగల్ని క్రమ్మేస్తుంటే - అక్కడ సుందరీకర్తలొక ముగ్గుర్నలుగురు మర రంపాలు, దంతెలతో సిద్ధమౌతారు - ఈ పని కోసం అవసరమైతే ఒక ఆకుల దుర్గాప్రసాదు చెట్టు మీదకు లంఘిస్తాడు కూడ!

5) ఐదవ పని రహదారినీ, మార్జిన్లనూ చీపుళ్లతో చిమ్మేదన్న మాట!

6) చివరి అరగంట ఆరేడుగురు ముమ్మరంగా వ్యర్ధాల లోడింగుకు పూనుకొంటారు - ఈ సమయంలో మాత్రం సందడి చెలరేగుతుంటుంది.

7) ఇంకొక శాస్త్రి గారు ఈ శ్రమైక సుందర దృశ్యాల్ని తనివి తీరా ఫొటోలు తీసుకొంటారు;

8) 6:20 కి DRK గారి విజిల్ ధ్వనిస్తుంటుంది!

9) అప్పటి కీ ఒకరిద్దరు అయిష్టంగా పని ముగించి, అందరూ కాఫీ లు సేవించి, గుడ్డ బ్యానర్ సాక్షిగా - పంట కాల్య వంతెన వద్ద నిలబడి, ఆస్పతి ఉద్యోగిని విజయరాణి నినాదాలకు మద్దతిస్తారు?

10) ఇక అంతిమంగా దాసరి వైద్యుల వారు నేటి శ్రమ సన్నివేశాల్ని వివరించి,

               రేపటి వేకువ కూడ ఇదే వంతెన - (శివరాంపుర సమీపాన) కలుద్దామని ప్రకటించారు!

          సర్వసుజనామోదయోగ్యమ?-7

వట్టి మాటల ప్రొద్దు పుచ్చక గట్టి మేలును చేసి చూపుచు

దేశమున కొక ఉదాహరణగ చల్లపల్లిని నిలుపు చుండిన

కార్యకర్తతొ చేయి కలుపక కర్మ హీనంగానె మిగులుట

సహేతుకమా? సమంజసమా?సర్వసుజనామోదయోగ్యమ?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    02.02.2026