3733* వ రోజు ..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

Pk.పల్లి బాటలో 8*, టోటల్ గా 3733* వ శ్రమదానం!

               ఈ నాటి (3.2.26 - మంగళవారం) 4 గ్రామాల శ్రామిక దాతలు ముప్పదిన్నొక్కరు, శ్రమ ప్రాంతం శివరామపురం దాపున పంటకాల్వ వంతెన కేంద్రంగా!

               “ఇందరిరెండేసి గంటల కష్టం 2 వ రోజు కూడ మళ్ళీ అదే చోటనా?” అనే సంశయం అక్కరలేదు - శ్రమ సమయంలోగాని, ఈ 7.40 AM. లోగాని నేటి శుభ్ర – సుందరీకృత 200 గజాల మార్గాన్నొకమారు పరిశీలిస్తే అలాంటి శంకలకు తావుండదు.

               పంటకాల్వ వంతెన పూర్వోత్తర దక్షిణ గట్లు ఎంత అందంగా ఉన్నవో - 7 గురి కష్టాన్ని జీర్ణించుకొని ఎలా పరిశుభ్రతతో అలరారుచున్నవో – నిన్నటి బసవ శంకరుని, నేడు పల్నాటి అన్నపూర్ణ ప్రయత్నంతో వంతెన గోడ లెలా కనువిందు చేస్తున్నవో చూస్తే ఎవరికీ  అట్టి సందేహాలే కలగవు!

               ఎక్కువ మంది శ్రమ మాత్రం మరొకమారు మేకలడొంక వైపున ఎండుకొమ్మల, చెత్తల లోడింగుకూ, చెట్ల సుందరీకరణకూ అంకితమైపోయింది! ఆ డజను మంది గంటన్నర సామాజిక బాధ్యతను ఎవరు చూసినా “అసలెందుకంతటి దీక్ష? ఊరికి దూరంగా, ఉన్న పచ్చదనాన్ని క్రమబద్ధం చేయడానికి కార్యకర్తలకింత పట్టుదలా!

               మంచు వెనకాడి, అచ్చటి దట్టమైన చెట్ల నడుమ జాలువారుతున్న వెన్నెల వెలుగులో జరుగుతున్న రహదారి సుందరీకరణ ప్రయత్నాన్ని ఏ భావుకులు చూసినా సహృదయస్పందన తప్పదు!

               “ఏమైనా సరే - శివరాత్రి నాటికి మిగిలిన 1 కిలోమీటరు రహదారి తామనుకొన్నట్లు అందంగా తయారుచేసి చూపుతారు” అనే నమ్మకం కలిగితీరుతుంది.

               6.40 వేళ ఏవో కొందరు కార్యకర్తల కూనిరాగాలు తప్ప - ముఖ్య గాయకుని గొంతు వినపడలేదు. పల్నాటి – నల్లూరి ఉమ్మడి ప్రాయోజతంగా రాగి లడ్డుల పంపకం జరిగింది.

               క్రమం తప్పని శంకర శాస్త్రి గారి 5,000/- చందాను చెక్కు రూపంలో DRK గారు కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించారు.

               రేపటి రహదారి బాగు చేతలు పంట కాలువ - శివరామపురాల మధ్య జరుగబోతున్నవి!

               సహేతుకమది, సమంజసమది!-8

గుడులు వందలు కట్టుకొన్నా – నుడులు లక్షలు చెప్పుకున్నా

సడలకున్నది మన జడత్వం – స్వచ్చ – సుందర ఉద్యమంలో

అడుగుపెట్టుటె మానవత్వం – లేదు మనకు గత్యంతరం

సర్వసుజనామోదకరమది, సహేతుకమది, సమంజసమది!

- నల్లూరి రామారావు

ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

03.02.2026