పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
37 గురి సేవలతో – 3734*వ నాటి శ్రమ!
పనిచోటు యథా ప్రకారం శివరామపురం పంట కాల్వ వంతెన కేంద్రంగానే! నిన్నటి కన్న కార్యకర్తలూ పెరిగారు, పని ప్రదేశమూ పెరిగింది.
వంతెన దక్షిణంగా క్రొత్త శివరామపురం దిశగా కొంత పని జరిగింది గాని, గత 4-5 రోజులుగా శుభ్ర పరచిన మేకల డొంక వైపే-3 చోట్ల3రకాల పారిశుద్ధ్య, సుందరీకరణ కృషి అక్కర పడడంతో- సగం మంది అటే మళ్లారు.
మిగిలిన వారు పూరి గుడిసెల పరిసరాలలోనే రహదారి మెరుగుదల పనులే ఇష్ట పడ్డారు! ఈ 15 మందిలో పద్మావతి ఆస్పత్రి సిబ్బందీ, ఒకరిద్దరు ట్రస్టు ఉద్యోగులూ, ఇతర ఔత్సాహికులూ!
నాలుగు రోజులుగా తమ ఇళ్ల వద్ద ఇందరు చేస్తున్న పనుల్లో అక్కడి వాళ్ళు మాత్రం వేళ్లు పెట్టలేదు.
ఈ ఉదయం కూడ 2 సంచుల గాజు- ప్లాస్టిక్ సీసాలు, ఇతర సింగిల్ యూజ్ వస్తువులు, చిత్తు పేపర్లూ దొరికాయి.
ఆకుల, పుల్లల, కొమ్మల వంటి విబాగానే సేకరించినా, ట్రాక్టర్ లో సర్దక- తూర్పు ప్రక్క మినప పొలం గట్టున మదుగుగా సర్దారు. లేకుంటే ట్రాక్టరు పట్టేదికాదు!
రోడ్డును కమ్మేస్తూ, చెత్త బళ్లకు ఇబ్బందిగా మారిన ఐదారు చెట్ల కొమ్మల్ని 5 గురు మర రంపంతో తొలగించి, ముక్కలుగా నరికి, గుట్టలుగా పేర్చారు గాని - ఆ యంత్రం పదేపదే ఆగుట వల్ల 6.30 దాక పని పూర్తికాలేదు!
6.40 కి కాఫీల- సరదా కబుర్లు ముగిశాక వంతెన మీద సమావేశమైనప్పుడు నిన్న ఆస్పత్రి నర్సు చిట్టూరి లక్ష్మీ, నేడు బత్తుల రవీ నినాదాలు ప్రకటించగా, నేటి పనులను DRK గారు సమీక్షించి,
రేపటి వేకువ కార్యకర్తలందరికీ శివరామపురం - వంతెనల మధ్యనే పని అని ప్రకటించారు!
ధర్మమేనా?క్షేమమేనా?-9
పారిశుద్ధ్యం నిర్వహించే స్వచ్చ సైన్యము ననుసరింపక
స్వచ్చ శకటం తిరుగుతున్నా చెత్త సరిగా అందజేయక
స్వార్థ రహిత సదుద్యమానికి అండదండగ నిలవకుండుట
న్యాయమేనా?ధర్మమేనా?క్షేమమేనా?సౌఖ్యమేనా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
04.02.2026