3735* వ రోజు .........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

ఎట్టకేలకు శివరాంపురంలోకి ప్రవేశించిన శ్రమదానం - @3735*

               దాని ముహుర్తం ఈ గురువారం (5.2.26) తెలవారుతున్న 5.40 సమయంలో. ఐతే - 4.18 కే పంటకాల్వ వంతెన దగ్గర 10 మంది కాలుష్య యుద్ధ వీరులు చేరుకొన్నారు. పని జరిగింది 6.18 దాక!

               పెదకళ్లేపల్లి రహదారి సేవా కార్యక్రమం మరీ అంత సులభంగా గ్రామంలోకి ప్రవేశించలేదు. అంతకుముందు గంటకు పైగా 15 మంది కార్యకర్తలు పడమర ప్రక్క డ్రైనునూ, మార్జిన్ నూ

1) 2 రకాల సీసాలను

2) తాడి బొందుల్ని సర్ది,

3) ప్రాత గుడ్డల్ని గోతాలలో నింపి,

4) ప్లాస్టిక్ తుక్కును ఏరి, గోతాలలో చొప్పించి,

5) రహదారిని శుభ్రంగా ఊడ్చాకే, చెత్త ట్రాక్టర్ తో సహా ఊళ్లోకి ప్రవేశించారు!

               అసలు తొలుత ఈ కార్యకర్తలు ఊరి 200 గజాల రహదారిని మనం ఊడ్చే కన్నా ఆ 15-16 ఇళ్లవారు శుభ్రపరచుకొంటే మంచిది గదా!” అనుకొన్నారు. గాని, వీధి మార్జిన్ల గడ్డినీ, పిచ్చిచెట్లనూ, చూశాక కొందరు టెంప్ట్ అయ్యారు, మిగిలిన వాళ్లూ కత్తో - గొర్రో – చీపురో పట్టి అనుసరించారు.

               ఈ పూట వృక్ష కాండ హంతక మర యంత్రానికీ, దాంతో పని చేస్తున్న నలుగురైదుగురికీ ఆ పని బదులు గ్రామముఖద్వారం వద్ద పనులే సరిపోయినవి!

               ఆరేడుగురు గట్టి కార్యకర్తలు మాత్రం పంటకాల్వ ఉత్తరపు గట్టు మీద - వంతెనకు తూర్పు పడమరల దిశల్లో పనులకు దిగారు. అసలే వెలుతురు చాలని చోట ముళ్ల పూల మొక్కల కొమ్మల్ని తప్పిస్తూ, గడ్డి చెక్కుతూ, గంటన్నర శ్రమిస్తే తెలిసింది, అది రైతులు వాడే కాలి - బళ్ల బాట అని! గతంలో ఈ బాటకడ్డొస్తూ ఎవరిదో పూరిల్లుండేది!

               అత్యవసర శస్త్రచికిత్స చేయవలసిన కారణాన Dr. DRK గారు 6.00 కు రాగలిగారు. 27 మందీ 6.18 కే పనులు ముగించి, లంకే సుభాషిణి సమర్పిత చిక్కుడు గింజల్ని స్వీకరించి,

               మాలెంపాటి అంజయ్య గారి ఖంగుమనే నినాదాలు తట్టుకొని,

               డాక్టరు గారి శ్రమదాన ప్రశంసా వచనాలు విని,

               రేపటి వేకువ శివరాంపురం చివరి ప్రేమానందం గారి ఇంటి ఎదుట కలవాలని నిశ్చయించారు!

             విస్తుపోవవలసినవా?

ఏమనవలె ఊరికొరకు ఈ శ్రమదానోద్యమాన్ని?

స్వచ్ఛోద్యమ చర్యలసలు బాధ్యతలా - సేవలనా?

ఋణం తీర్చుకొను నట్టివ? ఋణం ఇచ్చి పెంచునవా?

విస్తుపోవవలసినవా? ప్రస్తుతించవలసినవా?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    05.02.2026