3738* వ రోజు .........

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

ఆదివారం (8-2-26) కూడ 40 మంది P.K. పల్లి బాటలో - @3738*

               ఊరికీ, ఇళ్లకూ 3-4 కిలో మీటర్ల దూరాన కాక-మరీ ఇంత చలీ-మంచూ లేకపోతే? కార్యకర్తల 40 సంఖ్య 50 దాటేదే!

               ఈ శ్రమదానోద్యమం తొలినాళ్ళలో కొందరు అనుకోనేవారు-“అయ్యో! బంగారం లాంటి ఆ DRK ప్రసాదుకీ, ఆరేడుగురు ఊరివాళ్లకీ, రిటైరయిన ముసలి పంతుళ్లకీ, నిన్న-మొన్నటి దాక ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన జనవిజ్ఞాన వేదిక వాళ్లకీ.... ఇదేం పాడు ఆలోచన? ఈ 20 మంది ఇంత పెద్ద ఊరి బహిరంగ మలవిసర్జనలాపి, డ్రైన్లూ-శ్మశానాలూ, వీధులూ తీర్చిదిద్దుతారా? చెట్లుపెంచి, పూలు పూయించి, చల్లపల్లినొకనందనంగా మార్చి, దేశానికాదర్శంగా చేస్తారట ! ఆఁ..! చాలమందిని చూశాం ఇలా బయలుదేరిన వాళ్లను!....” అని! నిజం చెప్పాలంటే కొందరు విజ్ఞులు కూడ సంశయించారు. అవహేళనకూ పాల్పడ్డారు!

               ఐతే-అప్పుట్లో కొందరు ‘నవ్విన నాపచేనే పెరిగి, పండబోతున్నదిప్పుడు! చల్లపల్లిలో ఈ 3738 రోజుల్లో గణనీయమైన సానుకూల ధోరణులూ, మార్పులూ స్పష్టంగా తెలుస్తున్నవి! జాతీయ స్థాయిలోనూ-ఇంకా చెప్పాలంటే సురేష్ నాదెళ్ల పట్టుదలతో UNO స్థాయిలోనూ ఈ చల్లపల్లే ఒక మోడల్ గా నిలిచి, 40 గ్రామాలకు స్ఫూర్తిదాయకమైపోయింది!

               ఈ వేకువ తమ ఇళ్లకు సుదూరంగా జోరు మంచులో-4 గ్రామాల కార్యకర్తలు శివరామ-వెంకటాపురాల మధ్య 200 గజాల రోడ్డును ఊడ్పులో గాని, గడ్డి-పిచ్చిమొక్కల తొలగింపులో గాని, ప్లాస్టిక్-గాజు సీసాల, కప్పుల, సంచుల ఏరివేతలో గాని, చెట్ల సుందరీకరణలో గాని, అన్నన్ని వ్యర్ధాల లోడింగు, తరలింపులోగాని, 2గంటలకుపైగా ఎందుకు శ్రమించారు?

               ఈ పూట శ్రమదానానికి హైలైట్ గా-రహదారి పడమర పాతిక గజాల చోటును భారీ తాళ వృక్షాల కాండాలను అందంగా సర్ది, మరరంపంతో సైజులుగా కోసి, తుక్కును సర్ది, అంత చలిలోనూ సీసాలకొద్దీ నీరు త్రాగుతూ, చెమటలు చిందిస్తూ ఆ ప్రదేశాన్నొక శ్రమదాన ప్రయోగశాలగా మార్చడం చూసినప్పుడు నాకు..

               “ఈ చల్లపల్లి శ్రమోద్యమంతో పోల్చడానికి ఇంకెక్కడా-ఏమీ కనిపించవు” అనిపిస్తే అదినా తప్పా?

               ఏనాడో వేరే సందర్భంలో శ్రీశ్రీ వ్రాసిన ‘ఖడ్గసృష్టి’ (1964) గేయంలోని

“రావోయిలోనికి-సందేహం దేనికి?

నామనః కార్మికశాల క్రక్కేది భావాగ్నిసెగలు

క్రమ్మేది దావాగ్ని పొగలు....”

అనే కవితా పంక్తులు గుర్తొస్తే అదేమన్నా వింతా?

               నేటి శ్రమదాన ప్రతిజ్ఞాకారుడూ, సూక్తి వాచకుడూ అడపా గురవయ్య గురుడు..

               ఈ నెలకు ఒక్క ట్రస్టు ఉద్యోగి ఖర్చు (10,000/-) ప్రాయోజకుడు నల్లూరి సూరవర్ధనుడు (USA).

               తపన మన కర్ధమయినట్లే!

గత దశాబ్దపు నరక తుల్యపు జ్ఞాపకాలను మరిచిపోతే

మురుగు గబ్బుల - క్రిముల కీటక ముమ్మరింపులు తెలియకుంటే

కళాకాంతులు లేని వీధుల గ్రామ మొకపరి గుర్తు వస్తే

స్వచ్ఛ సుందర కార్యకర్తల తపన మన కర్ధమయినట్లే!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   08.02.2026