3739* వ రోజు .........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

9-2-26 న - 3739* వ నాటి రహదారి సేవల సమాచారం:

               గతంలోనే అనుకొన్నట్లు-ఇప్పటికి 2 వారాల నుండీ, రాబోవు వారం దాకా స్వచ్ఛంద శ్రమదానం పెదకళ్ళేపల్లి మార్గంలోని ఉభయ శివరామపురాల నడుమనే జరుగును!

               ఈ సోమవారం(9 వ తేదీ) నాటి అట్టి శ్రమదాతలు 28 మందిగానూ, వాళ్ళ శ్రమ నైవేద్యం ప్రాత శివరామపురం దగ్గర 150 గజాలలోనూ లెక్క తేలింది.

               పని చోటుకు చేరుతూనూ, తిరిగి ఇళ్లకు వెళుతూనూ కార్యకర్తలు మంచు వలన దారికానరాక ఇబ్బంది పడుట వాస్తవం. పెద్దలకైతే మరీ ఇబ్బందికరం.

               పనిచోటులు నిన్న శుభ్రపడినవి రెండూ, కోళ్ల ఫారాల దగ్గర మరొకటీ.

               ఎవరో నరికినవో లేక కూలినవోగాని, డ్రైనులో పడి ఉన్న 2 తాడి చెట్ల వ్యర్ధాల గుట్టల దగ్గర నేడు కూడ ముగ్గురు గట్టి కార్యకర్తలు గంటన్నర చొప్పున కత్తులు, పార, పలుగు, దంతె, డిప్పలుపయోగించి, శ్రమిస్తేనే ఆ డ్రైను ఇప్పుడు శుభ్రంగా మారింది. (అందులో ఒకరు తాటి దూలం మోస్తూ కాలు తడబడి, డ్రైనులో పడి, లేవడం సంగతట్లా ప్రక్కన పెడదాం!)

               డజను మంది కార్యకర్తలు దారికి తూర్పున పొలం వైపు ప్రధానంగా కత్తులతో-2 దంతెలతో- ఒక చీపురుతో చేసిన జంగిల్ క్లియరెన్సు గాని, రోడ్డు ఊడ్పు గాని, ప్లాస్టిక్ విభజింపు గాని వారి కర్తవ్య నిబద్ధతకు నిదర్శనం!

               లక్ష్మణ, బృందావనాది ఆరేడుగురు కూడ పడమటి డ్రైన్ లో దిగి, చిందరవందరగా పడున్న తాటాకుల్ని ఒడ్డున ఎంత అందమైన గుట్టగా పేర్చారో చూడండి. ఐతే ఆ గుట్టను ట్రాక్టర్ లోకి ఎగుమతి చేయక వదిలేశారు-పొయిలో పెట్టుకొనేవాళ్ళెవరైనా పట్టుకెళ్లడానికట!

               రోడ్డు మరామత్తు వల్ల తొలగిన తారు పెచ్చుల్ని సేకరించి, నలుగురు బాట మార్జిన్ లలో సర్దడాన్నీ గమనించవచ్చు!

               చెత్త లోడింగు సందడి గురించి క్రొత్తగా చెప్పడానికేముంది!

               మొత్తమ్మీద ఈ శ్రమదాన దృశ్యాల్ని చూస్తుంటే-ఒక సినిమా కవి వ్రాసిన “సొగసు చూడతరమా? నీ సొగసు చూడతరమా!” అనే పాట గుర్తుకొచ్చింది!

               బాగా అలస్యంగా జరిగిన తుది సమావేశంలో :

               మట్టా మహాలక్ష్మి వినిపించిన స్వచ్ఛ సుందర నినాదాలూ,

               2 గంటల పనుల సమీక్ష, రాత్రి గతించిన ‘వాకా నాగరాజు’ కు పరామర్శ,

               రేపటి పనులు ఇదే బాటలోని కోళ్ల ఫారాల వద్ద ఆగాలనే నిర్ణయమూ.

               అప్పుడప్పుడు ఇతర ఊళ్లను

ఇప్పుడైనా గ్రామ పౌరులు అప్పుడప్పుడు ఇతర ఊళ్లను

తులనాత్మకంగా చూసి వస్తే తప్ప తెలియదు ఈ విశిష్టత

స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమకు విలువలు తెలిసి వస్తవి

కొందరైనా కార్యకర్తలు బృందమున చేరెదరికప్పుడు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   09.02.2026