దశాబ్ద కాల - 3 తరాల దాతృత్వ వారసత్యం!....

 దశాబ్ద కాల - 3 తరాల దాతృత్వ వారసత్యం!

               స్వచ్ఛ సుందర చల్లపల్లి అనగానే కొందరికి గుర్తు వచ్చేవి శుభ్రంగా, అందంగా ఉన్న వీధులు, హరిత సుందర సౌకర్యవంతమైన శ్మశానమూ, గ్రామం చుట్టూ ఆరేడు చక్కని రహదారులు, అక్కడక్కడా 4 స్వచ్ఛ సుందర పబ్లిక్ టాయిలెట్లూ, చక్కని తోటల RTC బస్ ప్రాంగణమూ వగైరాలు! ఇంకా - ఊరిని అందంగా ఉంచేందుకు శ్రమిస్తున్న స్వచ్ఛ కార్యకర్తలు!

               తెరపైన కనిపించే ఇవేగాక- ఈ స్వచ్ఛ- సుందరోద్యమానికి సహకరిస్తున్న, తమ దాతృత్వంతో ఆ గ్రామాన్ని ఆశీర్వదిస్తున్న దాతలున్నారు. అందులో ఒక సకుటుంబ దాతృత్వం వూడత్తు వారిది.
               గత నెలలో పెద్ద వయసులో గతించిన వూడత్తు రామారావు గారు పారతోనో చీపురుతోనో వీధి సేవలు అంతగా చేయకపోవచ్చు గాని, స్వచ్ఛ కార్యకర్తలకు బిస్కట్ల పొట్లాలో, చాక్లెట్లో పంచడం ఆయనకలవాటు. ఈ పనులపట్ల ఆత్మికంగా మమేకమవుతూ ఊరి హరిత సౌందర్యాలకు ముగ్ధులవుతూ ఎప్పటికప్పుడు కార్యకర్తలతో సంఘీభావం నెలకొల్పుతూ అడగకుండా ఆర్ధిక సహాయం చేస్తూ పరమానందం పొందడం ఆ కుటుంబ సహజ లక్షణం.

వారి ముగ్గురు కుమారులు

వూడత్తు వెంకటేశ్వరరావు,

రామ్ గోపాల్,

నళినీ కుమారులు త్రికరణ శుద్ధిగా తమ గ్రామ శ్రమదానోద్యమాభిమానులు!

               శుభాశుభకార్యాలేవి తమ ఇంట జరిగినా, స్వచ్ఛ కార్యకర్తలకు ఆత్మీయ ఆహ్వానాలు తప్పవు. ఏ సమయములో ‘మనకోసం మనం’ ట్రస్టుకు అవసరమొచ్చినా ఈ ముగ్గురూ ఆదుకోవడానికి ముందు వరసలో ఉంటారు. లెక్కలు తీస్తేగాని వివిధ సందర్భాల్లో ట్రస్టుకు ఇచ్చిన, ఇస్తున్న 2-3 లక్షల సహకారాలు ఖచ్చితంగా తెలియవు.

- ఐదారు రోజుల నాడు డంపింగ్ యార్డు ప్రక్కన బోరు పంపు ఖర్చు కోసం తమ తండ్రి గారి జ్ఞాపక చిహ్నంగా వారిచ్చినది 30,000/-. ఊరి బైటా, లోపలా 32 వేల మొక్కలకు టాంకర్లతో అందించే నీరు ఈ బోరు పంపు నుండే!

               రామారావు గారి 3 వ తరం వారసుడు - వెంకటేశ్వరరావు గారి తనయుడు (యశ్వంత్) కూడ దాతృత్వంలో వీళ్లకు తగిన వారసుడే!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   19.02.2026

వూడత్తు రామారావు గారు
యశ్వంత్