3752* వ రోజు ............

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

ఆదివారం (22.2.26) వేకువ స్వచ్ఛ కార్యకర్తల శ్రమానంద లహరి - @3752*

               పెదకళ్లేపల్లి బాటలోని సాయి ఆక్వా, క్రాంతి కళాశాలల ప్రాంతంలో 4.18-6.20 సమయంలో జరిగిన రహదారి శుభ్రతకు సాక్ష్యంగా 6.40 ప్రాంతంలోని కార్యకర్తల ఫొటో చూశారా? అందులోని 38 సంఖ్యకు అప్పటికే నిష్క్రమించిన 5 కలిపితే, మొత్తం 43 మందికి నేటి శ్రమదానంలో ప్రమేయమున్నది!

               అలాగే-నేటి ఊడ్పుల, కాలుష్యాల ఏరివేతలకు ముందటి జుగుప్సాకరమైన, పర్యావరణ బాధాకరమైన, నిలవ మురుగుతో కంపుగొడుతున్న డ్రైను కాలుష్యాలను కూడ చూశారా? మరి వాటికి వెరవక కంపుల్నే ఇంపులుగా పోరాడుతున్న కార్యకర్తలనూ గమనించండి!

               ఎంత శ్రమిస్తే-ఎంత దుమ్మూ-ధూళీ వాళ్ల ముక్కుల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరితే-నడుములెంత నొప్పుల్ని భరిస్తే-దంతెలతో చెత్తల్ని లాగి లాగి గూళ్లు అలసిపోతే-ఒకరు కాదు, ఇద్దరు అనుభవజ్ఞ కార్యకర్తలెక్కి సర్ది త్రొక్కితేనే ట్రాక్టరు నిండితే... నేటి సామూహిక శ్రమ ఫలితంగా ఒక అందమైన వీధిగా మారిందో అర్ధమౌతుంది!

               ఒక్క పనికే ఇద్దరు సిద్ధపడడమూ, బరువు డిప్పల్ని భుజం మార్చుకోవడమూ కార్యకర్తల పరస్పర శ్రమ సహకారానికి గుర్తు.

               క్రాంతి కాలేజి వద్ద డ్రైను మరామత్తూ, సాయి రొయ్యల దాణా ఫ్యాక్టరీ వద్ద దట్టమైన 2 డ్రైన్ల, తూముల కాలుష్యాల ఏరివేతా ఎవరి సామాజిక బాధ్యతలకు నిదర్శనం?

               తక్కిన ప్రజల సంగతలా ఉంచి, ఈ ప్రాంతపు కవులూ, రచయితలూ, కళాకారులూ, సామాజిక పరిశీలకులూ ఈ చల్లపల్లి శ్రమదానాన్ని తరచూ చూస్తే-ఎన్ని కవిత్వాలు, పాటలు, విశ్లేషణలు వెలువడతాయో చూడాలి!

               నేటి ప్రతి స్వచ్ఛంద శ్రమదాత కష్టాన్నీ, రొచ్చుపనుల్లో వాళ్ల సంతృప్తినీ పూర్తిగా, విడివిడిగా వివరించలేని అశక్తతనాది, 40 మంది చేత స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు చెప్పించిన అదృష్టం ఆస్పత్రి కాంపౌండర్ పోతార్లంక వీరకృష్ణది;

               సోమవారం నాటి వీధి బాధ్యతల కోసం ‘క్రాంతి కళాశాల వద్ద కలుసుకోవాలనే నిర్ణయం గంధం బృందావన్ నాయకత్వంలో కొందరిది!

               చల్లగా దీవించుచున్నవొ

చల్లపల్లిని ఎవరి సేవలు చల్లగా దీవించుచున్నవొ

ఎవరి చెమటలు శ్మశానాలకు ఇంత అందం సంతరించెనొ

ఎవరు కాలుష్యాల పాలిట ఇంత సింహ స్వప్నమైరో

అట్టి సుందర కార్యకర్తల కంజలించెద మనస్పూర్తిగ!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    22.02.2026