పని రాక్షస పంచ ప్రసాదులు!
- సురేష్ నాదెళ్ళ - USA, 27.12.2025
వాళ్ల పని రాక్షసత్వం స్వార్థానికే అయితే ఇక్కడ ప్రస్తావనాంశం కానేకాదు – ఒక ఆదర్శానికి కట్టుబడి, గ్రామ సమాజ సామూహిక సంక్షేమంలోనే మన బాగోగులుంటాయని నమ్మి చేస్తున్న పని రాక్షసత్వం అది!
టూకీగా ఆ పంచ ప్రసాదుల వివరాలిలా ఉన్నాయి:
1. వేల్పూరి ప్రసాదు:
ఇతగాడు అష్టావధాని కాదు గాని, ఏకకాలంలో 3-4 పనులు చక్క బెట్టగలడు! ఫొటోల విషయం గాని, కంప్యూటర్ లో పేషంట్ల నమోదు గాని, వైద్య శిబిర నిర్వహణ గాని, స్వచ్ఛ కార్యకర్తల పట్ల సఖ్యతలో గాని, ఎలక్ట్రానిక్ - టి.వి.ల సంగతే గాని, ఫంక్షన్ల ఏర్పాట్లలో గాని ఘటికుడు. ఇక వేకువ స్వచ్ఛ కార్యక్రమం సంగతికొస్తే అక్కడ ఇతడు సవ్యసాచి!
2. ఆకుల దుర్గా ప్రసాదు:
అసాధారణ స్వచ్ఛ కార్యకర్త. పైకేమో సున్నితుడుగా - మర్యాదస్తుడు గా - మెతకగా అనిపిస్తాడు గాని, వేకువ చీకటి వేళ అతని బరువు కఠిన చర్యలు చూసి తీరాలి. అతని నైపుణ్యాలు బహుముఖీనం! పూల మొక్కల నారు తయారీలో గాని అవి నాటి పెంచే ప్రణాళికలో గాని, వీధి కుడ్య చిత్ర లేఖనాలలో గాని అందెవేసిన చేయి. ఇతని అతి మర్యాదలు ఇతరత్రానే గాని కాలుష్యాల నిర్మూలనలో కాదు.
అతడు లేనిదే చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమం అసంపూర్ణం!
3. జాస్తి ప్రసాదు:
2-3 ఏళ్ల కాలంలోనే రాటు తేలిన అసలు సిసలు స్వచ్ఛ కార్యకర్త. స్వల్ప వ్యవధిలోనే ఊళ్లో ఎందరికి తలలో నాలుకగా మారిందీ చూస్తే ఆశ్చర్యం కలగాల్సిందే! శ్రమదాన పనుల్లో ఏ ఆర్భాటమూ లేక- కూర్చొని గంటలు గంటలు పని చేస్తూ తానసలు పని చోటుకు వచ్చిందే తెలియనంత నిశ్శబ్ద - నిబద్ధ కార్యకర్త! తాను LIC లో SDM వంటి అత్యున్నత హోదా పొందినప్పటికీ తనను తాను అతి సాధారణుడిగా తగ్గించుకుని ఈ బురద మట్టి పనుల్లోకి మారడం ఎలా సాధ్యపడిందో!
4. సజ్జా ప్రసాదు:
క్షణాల్లో పనిలో విలీనం; మాటలో నిర్మొగమాటం,
ఖచ్చితత్వం; ముక్కుకు సూటి మనస్తత్వం , ధారలుగా స్వేదం, ఎంతటి బరువు పనులకైనా సై అనడం, తన పదెకరాల వ్యవసాయం అతి దీక్షగా నడుపుకున్నట్లే స్వచ్ఛ సుందర చల్లపల్లి వీధులూ, రహదారులూ అంత పట్టుదలగానూ చేయడమే ఈయన ప్రత్యేకత! తన వంతు పనిలో ఎంతగా – మునగానాం – తేలానాం అంటే అప్పుడీయన పూర్తిగా మితభాషి ! -- ఇదీ ఈ కార్యకర్త వ్యవహారం!
5. DRK ప్రసాదు:
క్షణం తీరిక లేని జీవితం, ప్రతి పనిలో-మాటలో జనహిత చింతనం, అటు పేషంట్లకూ-ఇటు సమాజానికీ ఈయన జీవితం ఏనాడో అంకితం, “ఒక్క వ్యక్తి ఇన్నిన్ని బరువు బాధ్యత లెలా మోస్తుంటాడా” అని అందరికీ ఆశ్చర్యం, పది మందికీ ఇంకా ఎంత తోడ్పడగలనా అనే ఆయన ఆరాటం. పాముకాటు వైద్యంలో అపార సుదీర్ఘ అనుభవం. ఊళ్లో అందరికీ ఈయనంటే మహా గౌరవం, ఆయన ఈ ఊరి అదృష్టం...అంటారు గానీ అందులో కొద్ది మందైనా ఆయన చెప్పినవి ఆచరించరని నా బోటి వాళ్ళ నైరాశ్యం...!