3754* వ రోజు ............

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

ఫిబ్రవరి - 2026 - 24 వ తేదీన 3754* వ శ్రమదానం!

               తమ ఊరి వెలుపల, పెదకళ్లేపల్లి రహదారికి తమ శ్రమను సంతోషంగా సమర్పించిన కార్యకర్తలు 30 మంది. వాళ్ల కష్టానికి ప్రతిఫలంగా శుభ్రపడినవి

- మరొక 120 గజాల రహదారీ, లోతైన డ్రెయిన్లు,

- తూర్పు ప్రక్కన గల 3 గోడౌన్లూ.

         అందుగ్గానూ వేకువ 4.20-6.20 ల నడుమ రకరకాల శ్రమ విన్యాసాలిట్లున్నవి:

- 2 రకాల సీసాలూ, ఇతర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లూ ఎక్కువగా ఉన్నందున ఇద్దరు కార్యకర్తలు వాటిని ఏరడానికి పరిమితమయ్యారు. మళ్లీ ఈ రోజు కూడ 3 సంచుల్ని నింపగలిగారు. ఈనాటి ఫొటో సాక్ష్యాల్లో 3 సైజుల మద్యం గాజు సీసాలను దుకాణంలాగా పేర్చడం కనిపిస్తే చూడండి!

- లోతైన డ్రైనులో దిగి, నానా చెత్తలనూ, లోతట్టు ముళ్ల-పిచ్చి చెట్లనూ గంటన్నర పాటు నరికి, ప్రోగులు పెట్టి, డిప్పలతో పైవారి కందించిన 15 గురి శ్రమను గూర్చి ఎంత వ్రాసినా తక్కువే!

- ట్రాక్టరులోకి అంతంత చెత్తను ఎక్కించిన పైనుండి ఒకాయన సర్దిన దృశ్యాలు ఎన్ని రోజులు చూసినా ఆశ్చర్యకరంగా నే ఉంటాయి!

- ఇంకొకాయన కాస్త ఆలస్యంగా వచ్చీ రాగానే గడ్డి చెక్కు యంత్రంతో బాటకు తూర్పుగా గడ్డి వేటలో చాలా దూరం వెళ్లాడు.

- ఇక - రోడ్లూ, మార్జిన్లూ ఊడ్చే వాళ్ళు కూడ తదేక దీక్షతో ఊడిస్తేనే కావూరి ఫైనాన్స్, వివేకానంద కళాశాలల దాక ఇప్పుడు రహదారి ఇంత శుభ్రంగా కనిపిస్తున్నది!

         మస్తాన్ గారు 2 దఫాలుగా చెప్పిన శ్రమదాన నినాదాలూ, విజయేంద్ర ప్రసాదు గారిని మొన్న  హైదరాబాదులో కలిసిన, దివంగత పాండురంగారావు గారి 1,00,000/- రూపాయల దానం సంగతులూ డి.ఆర్.కె. గారు ప్రస్తావించి,

       రేపటి వీధి పనుల కోసం H.P. గ్యాస్ కంపెనీ వద్ద కలవాలన్న నిర్ణయంతో నేటి కార్యక్రమం ముగిసింది.

                ఇక చాలింటికి పోదాం

ఒక గంటో - ఒక పూటో ఫొటో కొరకు సేవ చేసి,

ఇక చాలింటికి పోదాం - ఇది చాటింపులు వేద్దాం..

అని చూడక - పుష్కరముగ జన్మభూమి ఋణం తీర్చు

బాధ్యతలకు పరవశించి ప్రణమిల్లితె తప్పేమిటి?

 

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    24.02.2026