పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?
గంగులవారిపాలెం వీధికి చేరిన శ్రమదాన రథం!- @3758*
అసలీ గ్రామ బాధ్యతా రథయాత్ర 20-12-2013 న కదిలిందే అప్పటి ఈ అసభ్యకరమైన వీధి నుండి! మరో పది నెలలకు గాని సరిహద్దు గ్రామమైన చల్లపల్లిలోకి ప్రవేశించలేదు!
అప్పటి నుండి ఈ శుభ్ర-సుందరీకరణ రధయాత్ర కోవిడ్ కాలంలో 2-3 నెలలు తప్ప ఈ 11 ఏళ్ల 4 మాసాల నుండి అప్రతిహతంగా-కొన్నిమార్లు స్థిమితంగానూ, ఒక్కోమారు ఉధృతంగానూ సాగుతూనే ఉన్నది! ఐతే-ఆ రథానికి అప్పుడప్పుడూ మైనరు రిపేర్లు వచ్చాయి. ఐనా యాత్ర 3758* రోజులు పూర్తి చేసుకొన్నదంటే -
- రథాన్ని జాగ్రత్తగా నడపడంలో ఇక్కడి వైద్యసారథులిద్దరే కాక-హైదరాబాదులోని అసలైన సారథి గురవారెడ్డి కూడ కారణం!
- ప్రతి వేకువా 30-40-50 మంది స్వచ్ఛ కార్యకర్తల పవిత్ర హస్తాలు 150-200 గజాల చొప్పున ముందుకు త్రోస్తుంటాయి!
- గ్రామ వీధుల మురుగుకాల్వల వలనో, రహదార్ల చిట్టడవుల పనులప్పుడో ఈ రథయాత్ర కాస్తంత నెమ్మదిస్తుంటుంది!
- ఇటీవల పెదకళ్లేపల్లి రోడ్డుకు చెందిన 4 కిలోమీటర్ల-వెంకటాపురం దాకనే రథం నెల రోజుల్లో నడవగలిగింది!
- ఈ ఫిబ్రవరి మాసాంతపు శనివారం మాత్రం మరీ వేకువ 4.17 కే 20 మందితో గంగులవారిపాలెం వీధిలోని సన్ ఫ్లవర్ కాలనీ వద్ద ఆ రథచలనం మొదలై, 18 మంది మహిళలతో సహా-మొత్తం 55 మంది-కత్తులతో, చీపుళ్లతో, దంతెలతో, పారలతో ఈ స్వచ్ఛ రథాన్ని నెట్టడంతో -
1) సన్ ఫ్లవర్ వీధిలో 50 గజాలూ, సాయి – భవఘ్ని నగర్ ల ప్రాంతాన 200 గజాలూ స్వచ్ఛ రథయాత్ర సాగింది.
2) ఒక లోతైన డ్రైనూ, ముళ్ల – పిచ్చి చెట్ల-తీగల పొదలూ అడ్డుపడకుంటే రథం ఇంకా వేగంగా కదిలేదే!
“స్వచ్ఛ రథయాత్రానంతర సమావేశంలో తొట్టెంపూడి పెదబాబు అనబడే వెంకట కృష్ణారావు పాల్గొనడమూ, 2001 లో పద్మావతి ఆస్పత్రిలో పుట్టి, వైద్య పట్టభద్రుడైన గుళ్ళపల్లి సిద్దార్ధ మొన్న 10,000/- స్వచ్చోద్యమానికి విరాళమిచ్చి, కార్యకర్తల కష్టాన్ని తగ్గించే గడ్డి కోతయంత్రాన్ని తన బంధువైన పెదబాబు గారి ద్వారా బహుకరించడమూ విశేషము! క్రొత్త డాక్టరు గారి మేనమామ రావి రమణబాబు DRK గారికి వ్రాసిన ఆంగ్ల లేఖ అనువాదాన్ని పాఠకులీరోజు మన వాట్సప్ లో చదవండి!
తమ వీధిలోకి స్వచ్ఛ రధం వచ్చినప్పుడల్లా సహృదయంతో శ్రమదానంలో పాల్గొని రధ గమనానికి దోహదం చేస్తున్న సాయి, భవఘ్ని నగర్ ల ఔత్సాహికులకు అభినందనలు.
రేపటి వేకువ కూడ ఇదే గంగులవారిపాలెం బాటలోని సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డులోనే మనం కలవాలి!
నమస్కరింప కెట్లుందును
“ఊరుబైట దార్లెవరివి? ఊరెవరిది? ఎవరి వీధి?
ఈ పెంటలు-ఈ చెత్తలు ఎత్తే పని మాకెందుకు ?”
అని తలవక వేకువనే అన్ని పనులు చేయుచున్న
స్వఛ్ఛ వీరులకు శిరసా నమస్కరింప కెట్లుందును?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
28.02.2026