3761* వ రోజు .......

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

మంగళవారం నాటి (3.3.26) మంగళప్రద శ్రమదానం - @3761*

               కాస్త దారి మళ్లింపులున్నా శ్రమ జరిగింది ప్రధానంగా గంగులవారిపాలెం వీధిలోని భవఘ్నినగర్ లోనే! వీధి మెరుగుదల కోసం తలా ఒక చెయ్యి వేసినవారు 41 మందే! తమ వేళలు 4:16-6:15 మధ్యనే! తొలి ఛాయాచిత్రంలో లక్ష్మణ - సత్యం – అంజయ్యాదులతో బాటు - కొంగ్రొత్త బాల కార్యకర్త వెంకటాపురం పాఠశాల విద్యార్ధిని విస్మిత గూడ!

               “మరి నాలుగూళ్లకు చెందిన – వివిధ వయో, సామాజిక వర్గాలకు చెందిన ఇందరి సమష్టి ప్రయత్నాన్ని ఒక ఆదర్శ సామాజిక బాధ్యత” అనే కదా అనాలి? ఇందరి సుదీర్ఘ శారీరక – మేధాశ్రమలతోనే కదా ఈ చల్లపల్లికి ఇంత గుర్తింపు? 4 లక్షల పని గంటల ఎడతెగని శ్రమ సంరంభాన్ని “పేరు కోసమో, పదవుల కోసమో ఎర వేయడమనీ, తుస్సుమనే గాలి వాటం ఉద్యమ” మనీ అనవచ్చా?

               11 ఏళ్ల క్రితపు చల్లపల్లికీ, 3-3-26 నాటి గ్రామానికీ అసలు పోలికుందా? వీధివీధినా, చుట్టూ రహదారులందునా, బస్ ప్రాంగణ - శ్మశానాదులందునా ఎన్ని సానుకూల మార్పులు!

               అసలీ గంగులవారిపాలెం వీధి ఈ నాలుగవ నాటికే పని ముగించుకోవలసి ఉంది. ఐతే - ఈ కార్యకర్తల్లో కొందరికి గత 3 రోజుల పరిశుభ్ర సుందరీకరణ అంతగా నచ్చక - మళ్లీ వెనక్కొచ్చి, 2 వ - 3 వ మార్లు మరీ - మరీ మెరుగులు దిద్దారు; డ్రైన్లలో పిచ్చి కాడలు అనుకున్న దానికి మించి అల్లుకోవడమూ కారణమే! అందుకే ఈ శ్రమ జాతర మరో 2-3 రోజులు పట్టవచ్చు!

               ప్రశంసనీయమైన మరో అంశం - స్ధానిక వార్డు నివాసులు కలిసి రావడం. ఏ ప్రాంతపు వీధిలో పని జరుగుతున్నప్పుడు ఇలా అక్కడి స్థానికులు కూడ పాల్గొంటే చల్లపల్లి శ్రమదానోద్యమానికి మరింత నిండుదనం వస్తుంది.

               కాఫీల 6.25 వేళ కార్యకర్తలు శారీరకంగా కాస్త అలసినట్లు కనిపించారు గాని, మనసులు హుషారుగానే ఉన్నాయి!

               అందరూ కోడూరు వారి స్వచ్చోద్యమ నినాద మేఘ గర్జనలకు బదులిచ్చి, ఈ విజయవాడ వారి ఉగాది పురస్కారాన్ని DRK గారు అంగీకరించని కారణాన్ని తెలుసుకొని,

               రేపటి శ్రమ కూడ ఇదే గంగులవారిపాలెపు బాటలోనే భవఘ్ని నగర్ కే సమర్పించాలని నిర్ణయించుకొన్నారు! శుభం భూయాత్!

               వ్రాయకెట్లుందును?

 దిమ్మ తిరుగు స్వార్థములకు, తిక్కతిక్క చేష్టలకూ

 పర్యావరణ ధ్వంసానికి పాల్పడు ఈ సమాజమున

 అన్నిటినీ చక్కదిద్ద అష్ట కష్టములు పడు ఈ

కార్యకర్త దీక్ష మీద కవిత వ్రాయకెట్లుందును?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   03.03.2026