పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?
గురువారం (5.3.26) నాటి బండ్రేవుకోడు మురుగు కాల్వ దగ్గరి పనులు - @3763*
అవి మళ్ళీ వేకువ 4:14 కే డజను మంది గ్రామ బాధ్యులతో మొదలై, 2 డజన్ల మంది వాళ్ళతో కలిసి, 6:20 కి గాని పూర్తి కాలేదు!
మరి ఈ 36 గురు అన్ని పనిగంటల పాటు కేవలం 150 గజాల గంగులవారిపాలెం వీధి మలుపులో ఏం సాధించినట్లు? స్త్రీ – బాల - వృద్ధ కార్యకర్తలు మంచు గాలులు పీలుస్తూ ఇంత చీకటి వేళ దక్షిణపు డ్రైను దట్టమైన చెట్ల మధ్య చేసిన శ్రమ ఎంతవరకు సార్ధకం? అంటే:
అందుకు ప్రత్యక్షమైన సమాధానం ఈ అరకిలోమీటరు ఆస్పత్రి వీధీ, భవఘ్ని నగర్ రహదారి భాగంలోని అద్భుతమైన దృశ్యాలే! గత వారంలో కూడా ఈ బాట చూడచక్కగా, హరిత మనోజ్ఞంగా లేదని కాదు - రామనగర, చల్లపల్లి గ్రామాల నుండి ఈ వీధి ప్రయాణికుల, సందర్శకుల, ఫొటోల, నడకదారుల రద్దీ కొనసాగుతూనే ఉన్నాయి.
ఐతే - గత 6 రోజుల కార్యకర్తల కష్టంతో ఈ ఉదయానికి ఈ ఆదర్శ రహదారి మరింత నయనానందకరంగా మారలేదా? రోడ్ల ప్రక్కన చెట్లను క్రమ్మేసిన పిచ్చి తీగలిప్పుడు కనిపిస్తున్నాయా? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల జాడ ఇప్పుడున్నదా? కనీసం చెట్లకు తగులుకుని వ్రేలాడుతున్న వరిగడ్డి పరకలైనా మిగిలాయా? ముఖ్యంగా దుబాయి శ్రీను గారింటి వద్ద బాట కాస్తంత విశాలంగా, శుభ్రంగా మారలేదా?
డ్రైనులో గడ్డీ, గుర్రపు డెక్క తుక్కూ ఇప్పుడు కనిపించని కారణం ఇందరు కార్యకర్తల శ్రమ కాదా? ఈ 2 గంటల ప్రయత్నంలో:
- ఒకాయన ఫోను డ్రైనులో పడిపోయింది; (తరువాత దొరికిందనుకోండి)
- మరొకాయన చేతిని ఒరుసుకుంటూ పసరిక సరీసృపం జరజరా వెళ్ళిపోయింది.
- సగం మంది బట్టలూ, ముఖాలూ చెమటకు నానాయి, దుమ్ము కొట్టుకున్నాయి;
- కోడూరు, అంబటిల జంట ఒంగొనీ, కూర్చొనీ కనీసం 2 చోట్లను శుభ్రతరం చేసింది.
- ఇరుకు రోడ్డు వెడల్పు పెంచే పనిలో కస్తూరీ, బృందావనాదుల రెస్క్యూ టీం సఫలమయింది;
- అసలిందులో ఎవరి పట్టుదల, నిబద్ధత తక్కువ కనుక?
స్వచ్ఛ సుందరోద్యమాన్ని నిర్వహిస్తున్న మనకోసం మనం ట్రస్టుకు మాలెంపాటి డాక్టరు గారి 2000/- నగదు విరాళాన్ని DRK గారు స్వీకరించి, బందా జవహర్ డాక్టరు గారి 10 వేల ఆన్లైన్ విరాళం గుర్తించి,
అశ్వరావుపాలెం వాస్తవ్యులు కటికల నాగరాజు, దాసినేని తేజస్వి దంపతులు స్వచ్చోద్యమం కోసం 5,000/- రూపాయలను విరాళంగా ఇచ్చారు.
గురవయ్య మాస్టారి గత కాలం నాటి సాయిబాబా సుదీర్ఘ ప్రార్ధనను ఆలకించి,
రేపటి పనుల కోసం గంగులవారిపాలెం వీధి మలుపులో కలవాలని తేల్చేశారు!
స్థానిక భాగస్వామ్యం
ప్రభుత్వాలు మరో ప్రక్క ప్రజా ప్రతినిధులు కూడా
ఈ శ్రమదానోద్యమమును ఎంతగనో ఉగ్గడించి
కవి గాయకులెందరొ ఆ కష్టములను కీర్తిస్తే....
స్థానిక భాగస్వామ్యం చాలినంత దొరకదేల?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
04.03.2026