పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?
శుక్రవారపు (6.3.26) వేకువ వీధి సేవలలో 33 మంది-@3764*
అవి బాధ్యతలు కావచ్చు-సేవలే కావచ్చు-వాటి ప్రారంభ సమయం 4.15AM. రెండో-మూడో విజిల్స్ మ్రోగాక ముగింపు వేళ 6.16! ముకుళిత హస్తాలతో నిలిచిన తూములూరి లక్ష్మణునితో సహా 9 మంది గంగులవారిపాలెం బాటలోని వికారకర కాలుష్యాల మీద తొలివేటుకై సిద్ధపడ్డారు చూడండి!
ఇంకొన్ని నిముషాలలో వచ్చిన ఏడెనమండుగురు బాట పశ్చిమ మురుగు కాల్వలో దిగిన దిగడం – 60,70 గజాల డ్రైను సంపూర్ణ శుభ్రత పిదపనే-6.15 కే పైకెక్కడం! ఆ పడమటి గట్టు పిచ్చి తీగల అల్లికల నడుమ ఏ స్థల-జల చరాలున్నా-ముళ్ళు గీసుకుపోయినా బండ్రేవుకోడు కాల్వ తూము దాక ఆ మసక వెలుగులో ఎంత తుక్కు దొరికిందో వాళ్లనే అడగాలి!
రోడ్డు తూర్పున కారుషెడ్డు ప్రాంతపు దిబ్బపైన కత్తులతో, దంతెలతో ముగ్గురికి గద్దగోరు పూల చెట్ల వెనక దాగిన గడ్డి పైన, పిచ్చి చెట్ల మీద ఎందుకంత కసో గంటన్నర పాటు చెమట కార శ్రమించడమెందుకో గ్రామస్తులు గ్రహించాలి!
అసలీ చల్లపల్లి స్పచ్ఛ-సుందర కార్యక్రమం లేకపోతే-పదేళ్ల క్రితం దాక ఇళ్లకే పరిమితులైన మహిళలిందరు పనిచోటును వెతుక్కింటూ వచ్చేవారా? తమ సొంత పనుల్ని ప్రక్కన పెట్టి ఇందరు కార్యకర్తలు ఒక గొప్ప లక్ష్యంతో ఐక-మత్యంతో-ప్రతి ఫలాపేక్షరహిత భావంతో పనిచేయకపోతే ఈ గ్రామం అన్ని ఊళ్లలాగే వెలవెల పోతుండేది కాదా?
గతంలో ఒక ప్రవాసాంధ్రుడు-సురేశ్ నాదెళ్ల వర్ణించినట్లు-ఈ ఏకా దశాధిక వసంతాల శ్రమదానోద్యమం అన్ని హంగుల్నీ సమకూర్చుకొని, మంచి పాకాన పడింది కనుకొనే ఇన్ని ఫలితాలు!
నిన్నటితో ముగించాలనుకొన్న గంగులవారిపాలెం వీధి శ్రమదానం మరో 3 రోజులు పొడిగించబడింది! ఏం చేస్తారు మరి! వాళ్లు స్వచ్ఛ-సుందర కార్యకర్తలు! చూస్తూ చూస్తూ ఒక వీధి సుందరీకరణను అర్ధాంతరంగా ఆపలేరు కదా!
కాఫీ సేవనానంతర సభా కార్యక్రమం విజయా కళాశాల ఉద్యోగి వేముల శ్రీను నినాదాలతో మొదలై, DRK గారి సమీక్షతోనూ,
కోడూరు వారి ఉసిరిక పళ్ల వితరణతోనూ,
రేపటి వేకువ సైతం మన కర్తవ్యాలు గంగులవారిపాలెం వీధిలోనే అనే నిశ్చయంతోనూ ముగిసింది!
మాకినేని దుర్గాప్రసాదు గారు స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం 1 లక్ష రూపాయ చెక్కును డా. పద్మావతి గారికి ఆసుపత్రిలోనే అందజేయడమైనది.
పొగడకుండ ఎట్లుందును?
పరిశుభ్రత, పచ్చదనము ప్రజారోగ్యదాయకమని,
సింగిల్ యూజ్ ప్లాస్టిక్కులు చెరచు జీవ కోటులనని,
పది పన్నెండేళ్ల నుండి పట్టు బట్టి చక్కబెట్టు
పోరాటం చూసి కూడ పొగడకుండ ఎట్లుందును?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
06.03.2026