3765* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

శనివారం (7.3.26) నాటి ఊరి బాధ్యతలు 46 మందివి - @3765*

               చల్లపల్లి ఊరు చివరి వార్డు – చివర – గంగులవారిపాలెం బాటలోని బండ్రేవుకోడు కాల్వ ఉత్తరపు గట్టే నేటి శ్రమదాన రంగస్థలం! ఒక  ప్రక్క గద్దగోరు పూల అందాలు, మరో ప్రక్క మామిడిచెట్ల పచ్చందనాలు!

               అది అందమైన వీధి భాగమే, ప్లాస్టిక్ వ్యర్థాలు కూడ చిన్న సంచికే పరిమితమైనచోటే - కాని వరిగడ్డి పరకలూ, పొలం వైపు గడ్డీ, కొన్ని పనికిమాలిన మొక్కలూ, రోడ్డు బారునా కాస్తంత దుమ్మూ, వీటికి తోడు కొన్ని సుందరీకరణ చేయవలసిన చెట్ల కొమ్మలూ ఆ ప్రాంతపు అందానికి భంగకరంగా కనిపించినవి!

               అందుకనే వేకువ 4.17 కే 17 గురూ, ఆపైన 29 మందీ - వెరసి 46 మందీ ఆ కాస్త లోపాల్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు - 6.16 AM దాక!

               మురుగు కాల్వ అంచుల దాక అల్లిన గుర్రపు డెక్కల జోలికి పోలేదు గాని, తక్కిన చెత్తాచెదారాలనూ, కొద్ది పాటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లనూ పనిపట్టారు! నిన్నా - మొన్నటిలాగా కాల్వగట్టు డంపులూ, లోతు డ్రైను పనులూ లేనందున పనులు సాఫీగా - హ్యాపీగా సాగినవి.

               రోడ్డు మలుపు పొలం వైపు ఖాళీ పల్లపుచోట కొంత గడ్డినీ, పిచ్చి కంపనూ ముగ్గురు వదిలించాక, శుభ్రమైన జాగా కానీ, 2 బార్లుగా అడవి తంగేడు పూల చెట్లు గానీ పదే పదే చూడాలనిపిస్తున్నవి!

               నేటి 100 గజాలకు పైగా శుభ్రపడిన రహదారి సంగతీ, వాలంటీర్ల శ్రమల సంగతీ అలా ఉంచి, 45 మందీ బాట మలుపు దగ్గర నిలిచి, పిడికిళ్లు బిగించి, ఆస్పత్రి సీనియర్ ఉద్యోగిని కోవూరి శారద శ్రమదానోద్యమ నినాదాలకు బదులు పలికిన దృశ్యమే బాగా గుర్తొస్తున్నది.

               ఈపూట నల్లూరి సూర్య వర్థన్ నెలవారీ 10,000/- చందాను శివకుమారి సమర్పించడమూ, నిన్న డా. పద్మావతి గారికి మాకినేని దుర్గా ప్రసాదు గారు 1,00,000/- ఇవ్వడమూ విశేషాలు!

               రేపటి మహిళా దినోత్సవాన్ని నందేటి శ్రీను పాడిన గీతంతో నేడే ముందస్తుగా కార్యకర్తలు జరుపుకొన్నారు.

               ఆదివారం - 8.3.26 వేకువ కూడ మన పనులు బండ్రేవుకోడు వంతెన దరి దాపులలోనే!

              ఊరు నాకు ఏమిచ్చెను?

“ఊరు నాకు ఏమిచ్చెను? ఊరుకు ఈ మురికి పనులు

 శారీరక కష్టముతో చేయాలా ఇన్నేళ్ళని”

భావించక ప్రతి పనినీ బాధ్యతగా చేయుచున్న

శ్రమదాతల కెల్ల మనం ప్రణమిల్లిన తప్పేమిటి?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   07.03.2026