3766* వ రోజు .......

  పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

బండ్రేవు కోడు వంతెన వద్ద 3766*  శ్రమదాన సమాచారం!

ఈ ఆదివారం (8.3.26) వేకువ తొలి 17 మంది కార్యకర్తల శ్రమ ప్రారంభోత్సవం 4.16 కే ఫొటో సాక్ష్యం గా జరిగిపోయింది!  మొత్తం 40 మందీ 100 గజాల వీధికి ఎన్ని శుభ్రతలు, ఎంత సుందరీకరణ సాధించాలో అంతా సాధించారు!

ఊరికి, తమ ఇళ్ల కూ దూరమైనా, చేయవలసింది మురుగు కాల్వ గట్టు పనులైనా, ఇప్పటికి 3766 పని దినాలైనా, ఎవరూ తగ్గనేలేదు!

నాకు గుర్తున్నంత వరకూ 12.11.2014 న ఈ గ్రామ సేవా కార్యక్రమం ఏ మంచి ముహూర్తమో చూసి, పూజలు జరిపి, అట్టహాసంగా  ప్రారంభం కాలేదు! అస్తవ్యస్తంగా ఉన్న అప్పటి వీధి శుభ్ర - సుందరీకరణకు పూనుకోవడమే ఒక సుముహూర్తం! గ్రామస్తుల్నుండి పాక్షిక, పంచాయతి, రాజకీయ నేతలు, దాతల పూర్తి సహకారంతో ఈ శ్రమ వేడుక ఇంత దూరం వచ్చింది!

చాల ఊళ్ళ ప్రజలు సాధారణంగా ఆదివారం తమ పనులకు ఆటవిడుపుగానో, ప్రయాణీలకు అనువుగానో భావిస్తుంటారు. ఈ గ్రామ స్వచ్చ కార్యకర్తలు మాత్రం “సెలవు కదా - ఇంకొంచెం గ్రామ మేలుకు ప్రయత్నిద్దాం....” అని ఆలోచిస్తారు!

ఈ ఆదివారమూ అంతే! పొరుగూళ్ల కార్యకర్తలు సహా 40 మందికి అదే ధ్యాస! నిన్న పని ముగిసిన కాల్వ గట్టు చోటు నుండి 2 ప్రక్కలా -

- కొందరు కత్తులతో, పారలతో గడ్డి చెక్కారు,

- దంతెలతో ఏడెననమండుగురు ఆ వ్యర్థాల్ని బాట పైకి లాగి గుట్టలు చేశారు,

- బాట దక్షిణాన ఎగుడుదిగుడు చోట కాళ్లు బ్యాలెన్స్ చేసుకొంటూ పిచ్చి మొక్కల్ని సమూలంగా తొలగించడం సులభమైన పనేం కాదు,

- చీపుళ్ళవారు 2 గంటల పాటు రోడ్డునూ, మార్జిన్లనూ ఊడుస్తూనే ఉన్నారు,

- చివరి అరగంటలో లోడింగు వారి పనులు యధాతథంగానే !

- శ్రమ తెలియకుండా మధ్యలో కొందరి కూని రాగాలూ, అప్పుడప్పుడు చెక్ పోస్టు వారి అదలింపులూ అంతే!

6. 10 కీ, 6. 15 కీ 2 విజిళ్లు ! అప్పుడు పని విరమణ! ఈలోపు వంతెన దాటి, హైవే వైపు దాకా ముగిసిన ఊడ్పులు!

కృత్రిమంగా మైకెందుకని- సహజసిద్ధమైన మైకుతో కోడూరు వారి అదిరిపోయే నినాదాలు!

 రేపటి పనులకై NH-216 మలుపు వద్ద కలవాలని నిర్ణయం!

ఇవే అది వారపు శ్రమ వార్తలు!

              మోడల్ గా  నిలవాలని

ఊరి శుద్ధి చేసేందుకు ఉద్యుక్తులు కావాలని

 సామాజిక సామూహిక సత్కార్యం చేయాలని

దేశానికి తమ గ్రామమె మోడల్ గా  నిలవాలని-

కార్యకర్తలకు మాత్రమే కలుగనేల ఆలోచన?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   08.03.2026