3768* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?

3768* వ (మంగళవారం  (10-03-26) శ్రమదాన కథ!

               సదరు శ్రమ కథ కూడ 4.16 కే మొదలై, 6.15 కు ముగిసింది! శ్రమగ్రహీత మళ్లీ 11 వ రోజు కూడ అదే గంగులవారిపాలెం బజారు! ఈ 1 కిలోమీటరు వీధి శుభ్ర - సుందరీకరణ ఈ రోజుతో ముగుస్తుందని 4 రోజుల్నుండీ అంచనా వేస్తున్నాను గాని, బహుశా రేపు ఆ ముగింపు ఘడియలు రావచ్చు!

               నేటి వేకువ మురుగు కాల్వ వంతెన వద్ద బాధ్యతలకు పూనుకొన్నది పట్టుమని పాతిక మంది! పని జరిగింది కూడ నిన్నా మొన్నటి ప్రదేశమే! - అదే వంతెనకు 3 ప్రక్కలా; మరి “ఈ ఒక్క వీధి పనులే 12 నాళ్లెందుకు పట్టాలి?” అనే ధర్మసందేహాలకు సమాధానం- ముఖ్యంగా చల్లపల్లి వారికి కలిగితే - ఒక్కమారు పన్నెండేళ్ళ వెనకటి ఈ బజారును గుర్తు తెచ్చుకోండి! ఇప్పటితో బేరీజు వేసుకోండి!

               కార్యకర్తల పనుల ఆలస్యమెందుకంటే - ఇదేదో పనికి ఆహార పథకంకాదు, కూలి చెల్లిస్తున్న పారిశుద్ధ్య పనులూ కావు, ఎవరి బలవంతంతోనో - ప్రలోభంతోనో ఈ 30-40-50 మంది వచ్చి పనులు చేయడం లేదు, ప్రతి నిత్య సామాజిక కర్తవ్యంగా - అంతరాత్మ వివేకంతో జరిగే శ్రమదానం కనుక సొంత బుర్రలతో ప్రతి పనీ క్షుణ్ణంగా చేసుకుపోతుంటారు కనుకనే ఈపాటి ఆలస్యం!

               ఇక ఇందుకు ఋజువులా? వంతెన తూర్పున అంబటి కోడూరుల జంట శుభ్రపరచిన తీరు గమనించండి; పడమర భాగాన అంజయ్య, బృందావన, కస్తూరి, మరొక నర్సు జ్యోతీ రిస్కుతో చేసిన రోడ్డు రక్షణలు చూడండి; బరువైన గడ్డికోత మిషన్ తో ఆకుల దుర్గాప్రసాదుని పనిని పరికించండి; హైవే – వంతెనల నడుమ కత్తీ – దంతెల ముఠా దీక్షను పరీక్షించండి! తుక్కు లోడింగెలా ముగిసిందీ వీక్షించండి!

               ఆపైన 6.30 కి స్వాగతద్వారం ప్రక్కన 25 మందీ పిండి నాగజ్యోతిని అనుసరించి చల్లపల్లి స్వచ్ఛ-శుభ్ర-సుందరీకరణ ప్రతిజ్ఞల్నీ వినండి!

               రేపటి వేకువ కూడ మన పారిశుద్ధ్య చర్యలు NH-216 వద్దనే అని గుర్తించండి!

               సమష్టి కృషి చాలకనే!

ముప్పై నలభై ఊళ్లలొ మొదలెట్టిన శ్రమలెగాని-

అసలెన్నడు మొదలె కాని అన్య గ్రామములె గానీ

విఫలమైన కారణమును విన్నవించమందురా?

-“చల్లపల్లి లో లాగున  సమష్టి కృషి చాలకనే!”

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  10.03.2026