పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!
3770* వ వీధి శుభ్రత మరీ వేకువ 4.10 కేనా!
ఈ గురువారం - అనగా 12.3.26 కొందరు కార్యకర్తల వరస చూస్తుంటే వేకువ 3:00 నుండే వాళ్ళకు నిద్ర పట్టదేమో అనిపిస్తున్నది! పాతిక వేల మందికి అంతగా పట్టని గ్రామ స్వచ్ఛ శుభ్ర-సౌందర్య వికాసం నేటి 32 మందిని వదలక అంట కాగుతున్నదెందుకా అని ఆశ్చర్యం కలగుతున్నది. గ్రామ జనుల్లో వీళ్లదొక ప్రత్యేక తెగా అనే సందేహమూ కలుగుతున్నది!
నిన్న మొన్నటి దాక చలీ-మంచూ, ఇక ఇప్పుడేమో వేడి-ఉక్కపోతలూ! ఋతువేదైనా-ప్రకృతి గతి ఎట్లున్నా ఈ రోజువారీ 30-40-50 మంది వీధి శ్రమకారులకు మాత్రం పట్టవు! “అనుకొన్నట్లుగా ఈ పూట బందరు వీధిలో రామానగర సరిహద్దు నుండి మునసబు వీధి దాక బజారుకు మెరుగులు దిద్దలేకపోతిమే-SRYSP. కళాశాల వరకు మాత్రమే చేయగల్గితిమే!” అనేది వాళ్ల అసంతృప్తి!
అందుక్కారణం లేకపోలేదు. వాళ్ళ పనులు కేవలం MTM రోడ్డుకే పరిమితమై ఉంటే,
- 6 వ నెంబరు పంట కాలువ పనులడ్డపడక పోతే,
- గత కాలపు వడ్లమర వీధి భాగంలోకి 12 గురు చొరబడకున్నట్లైతే,
- కేవలం ముగ్గురే కళాశాల ఎదుటి ఉద్యాన శుభ్రతకు పూనుకోవలసి రాకుంటే!
మునసబు బజారునే కాదు, భగత్ సింగ్ దంత వైద్యశాల దాక బాగుపడేదే!
ఆరవ పంట కాల్వ వంతెన వద్ద అరబండి వ్యర్ధాలుంటాయని కార్యకర్తలూహించలేదు;
పైకి శుభ్రంగా ఉన్నా 5 గురు గస్తీ గది ప్రాంతాన్ని పునః సుందరీకరించారు; గ్రేస్ ఆస్పత్రి, టీ దుకాణం, SBI వద్ద, మళ్లీ ఎంత దుమ్ము, వ్యర్ధాలు దొరికాయో నిండిపోయిన చెత్త బండిని చూస్తే తెలియడం లేదా?
ఊళ్లోని అందమైన ఈ వీధి భాగంలో గోనె సంచీడు ప్లాస్టిక్-గాజు సీసాలు దొరకలేదా? పైగా-పాఠశాల ముందున్న డ్రైన్ లో ఇంకొన్ని ప్లాస్టిక్ చెత్తలు మిగిలి, స్వచ్ఛ-సుందరోద్యమాన్ని వెక్కిరించడం లేదా?
మరి-ఇందుకే గదా 12 ఏళ్ళవుతున్నా ఈ శ్రమదానోద్యమం కొనసాగింపు? పనులన్నీ ముగిసి, SBI ఎదుట జరిగిన సమీక్షా సందర్భాన్ని దేసు మాధురి నినాదాలతో ప్రారంభించగా,
కిడ్నీల దినోత్సవాన్నీ, ప్రతివారూ పరీక్ష చేయించుకొనే అవసరాన్నీ, ఈ మధ్యాహ్నం గంగులవారిపాలెం వీధిలోని సంస్మరణ సందర్భాన్ని,
రేపటి ఉషోదయాత్పూర్వం మనం మళ్లీ SBI వద్దనే కలువవలసిన అవసరాన్నీ Dr. DRK గారు వివరించారు!
ప్రణమిల్లుట మంచి పనే!
పొర పాటున విష సంస్కృతి పుట్టుకొచ్చె కొన్నేళ్ళుగ
సింగిల్ యూజ్ ప్లాస్టిక్కుల వినియోగం మితిమీరెను!
ఆ విషముకు విరుగుడుగా స్వచ్ఛోద్యమ కారులిరుగొ
అట్టి త్యాగ మూర్తులకు ప్రణమిల్లుట మంచి పనే!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
12.03.2026