పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!
శుక్రవారం (13.3.26) కూడ బందరు వీధి సేవలే! @3771*
బాధ్యతల ప్రారంభం కూడ 9 మందితో- SRYSP, కళాశాల వద్ద 4.10 AM కే! ఇంత సువిశాల-పాతిక వేల జన సంఖ్యా సంపన్నమైన గ్రామం నుండి గ్రామ సామాజిక కర్తవ్య మూర్తులు 30+2+1=33 మందే! (వీరిలో ఇద్దరు పార్ట్ టైమర్లు, శ్రావ్య కృష్ణ ఆస్పత్రి వైద్యుడు శీలం అశ్వని కుమార్)
ఇక ప్రజాహ్లాదకరంగా రూపొందిన వీధి కూడ 100 గజాలే! కనీసం మునసబు గారి వీధి వరకైనా సాగకుండా స్వచ్ఛ-సుందర రథానికడ్డుపడినవి-
1) రోడ్డుకు దక్షిణాన మురుగు కాల్వ,
2) పండ్ల, నూడిల్స్ దుకాణాల వద్ద దుమ్మూ-ఇతర వ్యర్ధాలూ,
3) ఉత్తరం ప్రక్కన ఉద్యాన వ్యర్ధాలూ!
సగం కార్యకర్తలు రెండేసి గంటలు, మరికొందరు గంటన్నర చొప్పునా నిర్విరామంగా కష్టపడలేదా అంటే-కష్టించిన మాట వాస్తవమే! ఆరేడుగురి చీపుళ్లు ఎంతగా ప్రయత్నించకపోతే 20-30 డిప్పల దుమ్మూ-ఇసుకా వచ్చింది?
పండ్ల కొట్టు మాటునా, పానీ పూరీ బండి వెనకా, వెతికి వెతికి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లను ఏరి ఏరి, చిన్నారి ఆస్పత్రి ముందటి డ్రైన్ వ్యర్ధాలను దంతెలతో లాగి లాగి, అన్నన్ని గాజు-ప్లాస్టిక్ సీసాలను సేకరిస్తే స్వచ్ఛ శుభ్ర సుందరీకరణ ఆలస్య౦ కాక ఏమోతుంది?
మూల్పూరి వారి ఉద్యానంలో గాని, కొబ్బరి బొండాల-మెకానిక్ షెడ్ల-క్షురక దుకాణాల వద్ద కూడ తగు మాత్రంగా రకరకాల వ్యర్థాలు దొరికాయంటే అక్కడ మహిళా కార్యకర్తలు ఎంతగా కష్టించి ఉండాలి?
నేటి 30 మంది శ్రమా వ్యర్ధం కాలేదు. గిరి గీసినట్లు-6 వ పంట కాల్వ వంతెన నుండి శావ్య కృష్ణ ఆస్పత్రి దాక మార్గమెంత పరిశుభ్ర-సుందరంగా ఉన్నదో, ఆ తరువాత పడమటి దిశ రోడ్డెలా ఉన్నదో గమనిస్తే చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదానం విలువేమిటో తెలిసొస్తుంది! ఈ ఉద్యమం ఇప్పటి దాక ఏమేం సాధించిందో గుర్తుకొస్తాయి!
నిన్నటి కార్యకర్తల కిడ్నీ పరిక్షా ఫలితాలు అందాయి; ఈరోజు, రేపు మిగిలిన వారు కూడా పద్మావతి ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవచ్చును.
ఇప్పటికి 79 పర్యాయాల రక్తదాన వీర సూర కర్ణుడు కస్తూరి విజయ్ పలికిన నినాదాలూ, ఇటీవలే ఆస్పత్రి ప్రారంభించిన యువ వైద్యుడు శీలం అశ్వని కుమార్ గారి పరిచయమూ నేటి ముఖ్యాంశాలు!
రేపటి వేకువ మునసబు వీధి కూడలి వద్దనే మన వీధి పారిశుద్ధ్య పనులు.
నీరు విషము- గాలి విషము - భూగోళమే విషం విషం
క్షణక్షణం పర్యావరణము పూర్తిగ కలుషితం
అందుకు విరుగుడుగా ఈ సుందర స్వచ్ఛోద్యమమును
ప్రకటించిన మహాత్ములకు ప్రణమిల్లిన తప్పేమిటి?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
13.03.2026