3772* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

 మార్చి 14 (శనివారం – 2026 ) నాటి శ్రామిక పద్ధతులు- @3772*

 అవి కాస్తా వేకువ 4.15 కు ముందే- అంటే నియమిత కాలానికి  పావుగంట ముందుగానే- 22 మందితో మొదలైనవి చూశారా? అప్పటి నుండి నిముష క్రమాన మునసబు గారి, సజ్జావారి వీధుల వద్దకు వచ్చిన  కార్యకర్తలు 27 మంది!

ఈ 49 మందిలో 5 గురు డాక్టర్లు కూడ! గత, ప్రస్తుత కాలాల బడి పంతుళ్లూ, ఇతర ఉద్యోగులూ, వృత్తి నిపుణులూ, వ్యాపారులూ,  గృహిణీమతల్లులూ ఈ బ్రహ్మకాలపు వీధి పారిశుద్ధ్యాన్ని చాల కాలం నుండి తమ నిత్య జీవితంలో భాగం చేసుకొన్నారు - పరిమిత సంఖ్యలో!

మరి - ఒకనెలా? సంవత్సరమా? ఐదేళ్ళా? ఎంతకాలం ఈ గ్రామ పారిశుద్ధ్య వ్రతం ? 12 ఏళ్ల పిదప కూడ ఇంకా ఏమేం సాధించాలని వాళ్ల పంతం? తమ ఊరి కోసం ఇంకా ఏమేం సౌకర్యాలు కల్పించాలని కార్యకర్తల ఆశయం?

నేటి కనీసం 60 పని గంటల శ్రమదానంతో బాగుపడిన బందరు వీధి చోటుల లిస్టు పెద్దదే!

అన్నిటికన్నా పెద్దదీ, 20 మంది శ్రమించినదీ, బాగా దుమ్ము మేఘాలు ఏర్పడినదీ 1వ వార్డు ప్రవేశ మార్గ ప్రాంతమే. పంట కాల్వ రోడ్డు కోసం అక్కడ నిల్వ చేస్తున్న కంకరా,  ఇసుకా, చిప్సూ వాళ్లు ఎత్తగా మిగిలిన వ్యర్థాల్ని ఊడ్చి, గోకి, పారల్తో ప్రోగులు చేసి, డిప్పల్తో ట్రాక్టర్లో నింపే దృశ్యం నిజంగా ఈ స్వచ్చ- సుందర శ్రమోద్యమానికొక పతాక సన్నివేశమే!

ఈ గంటన్నరలో వాళ్ళు తలా చారెడు ధూళిని ముక్కుల్లోకి పీల్చి  ఉంటారు!

అక్కడికి ఉత్తరంగా పూడిన చెరువు అంచుల్ని ముగ్గురు బాగు చేస్తూ శ్వాసించిన కంపుగాని, బట్టలకు బురద గాని ఫొటోల్లో దొరికితే చూడండి. ఏడెనమండుగురి శ్రమతో అటు సజ్జా వారి వీధి గాని, ఇటుగా కర్మల భవనం వెనక భాగం కాని, కొంతమేరకు మునసబు వీధి గాని, బందరు రోడ్డులో భగత్ సింగ్ ఆస్పత్రి వరకూ గాని ఎంత కష్టపడితే 6.30 తరువాత ఇంత అందంగా మారెనంటారు? 

రకరకాల జీవన మార్గాల వారూ,  వివిధ కుటుంబ, సామాజిక నేపధ్యాల వారూ అమరావతి జమిందారుల ఆర్చి వద్ద అర్ధవలయంగా నిలిచి, విశ్రాంతోపాధ్యాయిని రాయపాటి రమ గారి నినాదాలను బలపరచి, అందుకోగల్గిన గ్రామస్తులకు సామాజిక బాధ్యతా సందేశం పంపించారు.

ఇక వీరు రేపు కలువవలసిన చోటు గూడ కర్మల భవన (బందరు వీధి లో) ప్రాంతమేనట!

           నిర్వహించు శ్రమ యజ్ఞము

ఆశావహ దృక్పథమే అభ్యుదయపు సూచికగా

గ్రామ సుందరీకరణమె తక్షణ కర్తవ్యముగా

గ్రామస్తుల చైతన్యముకై ప్రయత్నపూర్వముగా

నిర్వహించు శ్రమ యజ్ఞము గర్వకారణము కాదా ?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   14.03.2026