పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!
మళ్ళీ వేకువ 4:14 & 6:17 నడుమనే ముఖ్య వీధి సేవలు - @3773*
ఈ ఆదివారం (15.03.2026) తొలి బాధ్యతలు పాతిక మందివీ, మొత్తమ్మీద 54 మందివీ! వీధి పారిశుద్ధ్య పనుల కోసం అగినది భగత్ సింగ్ దంత వైద్యశాల వద్ద! పనులు జరిగినవి 3 చోట్ల!
బందరు వీధిలోని ఆ 3 ప్రదేశాలివి!
1. కర్మలభవనం లోపలి ఖాళీ స్థలమూ, మురుగు కాలువ,
2. మునసబు వారి వీధీ-ముఖ్యంగా వీధి మార్జిన్లనాక్రమించిన కొబ్బరి బొండాల దుకాణపు జాగా,
3. ఆర్చి ద్వారం మొదలు రిలయన్స్ మాల్ వరకు 100 గజాల MTM వీధి.
తయారైన వ్యర్ధాలు :
A) పై 3 చోటుల్లోని గడ్డీ, పిచ్చి మొక్కలూ,
B) గోనె సంచికి సరిపడా గాజు, ప్లాస్టిక్ సీసాలూ, గ్లాసులూ, కప్పలూ
C) షణ్ముఖ శ్రీను గారు ఏరిన ప్లాస్టిక్, ఇతర కాగితపు ముక్కలూ, గాజు పెంకులూ మరొక గోతాం.
ఈ గ్రామ ప్రముఖ వీధి శుభ్ర సుందరీకరణలో ఎవరెంత చెమటక్రక్కారో, ఎంత దుమ్ము పీల్చారో, ఎవరి నడుములూ గూళ్లూ-మోకాళ్లూ ఏపాటి నొప్పి చేసినవో ఎవరు లెక్కిస్తారు? ఏదో ముగ్గుర్నలుగురు నాతో చెప్పారు, మిగిలినవారు మిన్నకుండిపోయారు! ఇష్టపడి చేస్తున్న కష్టమాయె!
అసలీ నాలుగైదూళ్ళ-వివిధ వయస్కుల-వర్గాల-54 మంది 4.30 కే వచ్చి, దుమ్ము-మురికి-చెత్త పనులు చేయడమే ఒక వింత! ఇంత పెద్ద గ్రామం పనులు అవిచ్ఛిన్నంగా ఇన్నేళ్లు జరగడమే విచిత్రం! వెంకటాపురం నుండీ, అక్కడెక్కడో కొల్లేరు ప్రాంతం నుండీ ముగ్గురు ఈ పనులకు వచ్చిందే పెద్ద ఆశ్చర్యకరం!
దంత వైద్యశాల గేట్ల ముందు కూర్చొనీ, నిలబడి జరిపిన సమీక్షా సభలో విశేషాలివి:
- RMP వైద్యుడు శేషు గట్టిగా ప్రకటించిన స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాలూ,
- అతడే కార్యకర్తలను నవ్విస్తూ పాడిన పేరడీ పాటా,
- వేముల అర్జునరావు గారి కుమారుని రిసెప్షన్ సందర్భంగా కీర్తి ఆస్పత్రి ప్రక్కన ఈ సాయంత్రం 7.30 కు విందుకు వారి తరపున వేముల శ్రీనివాసుని ఆహ్వానమూ,
- ఎప్పటిలాగే ఇందరి సామాజిక-సామూహిక శ్రమను చూసిన DRK గారి ఆనందమూ,
రేపటి బందరు వీధి సేవలకై మనం కలువదగింది భగత్ సింగ్ గారి ఆస్పత్రి వద్దననే సమాచారమూ!
ఇది గదా ఒక స్తిత ప్రజ్ఞత!-1
‘ఊరు నాకేమిచ్చె’ నని కా ‘కూరికేం నే నివ్వగల’ నని,
గ్రామ స్వస్తత తోనె వ్యక్తుల భవిత ముడి పడె’ నని గ్రహించీ
పదునొకండేళ్లుగా ఊరికి సకల సేవలు చేయుచుండుట:
ఇది గదా నిష్కామ కర్మము! ఇది గదా ఒక స్తిత ప్రజ్ఞత!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
15.03.2026