3774* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

సమయమూ అదే-గ్రామ పారిశుద్ధ్య బాధ్యతలు అవే! - @3774*

               రోజు మారింది-సోమవారం (16-3-26). కార్యకర్తల సంఖ్య తగ్గింది-33 మందే!

               పని స్థలంలో పెద్దగా మార్పులేదు-అటు బందరు రోడ్డులోనే రిలయన్స్ మాలు నుండి ఇటు కర్మల భవనాంతర్గత స్థలం దాక! అదనంగా మునసబు గారి వీధిలోని డ్రైన్ లోతట్టూ, సజీవ మత్స్య దుకాణ ప్రాంతమూ!

               అమరావతి జమిందారుల వైజయంత ప్రహరీ ప్రాంతం నిన్ననే శుభ్రపడి, ఈ పూట అక్కడ ఊడ్చేందుకెవ్వరూ పోలేదు; అందుక్కారణం అక్కడ మిగిలిపోయిన గడ్డి మొక్కల అంతు చూస్తున్న దుర్గా ప్రసాదుని యంత్రం లేపుతున్న ధూళి మేఘాలే!

               BSNL నరసింహుని టీము నిన్నా- ఈ పూటా బాగుచేసిన కర్మల భవనాంతర్భాగాన్ని 5 నిముషాలు చూసినా తనివి తీరడం లేదు. అటుగా వెళ్ళేవారెవరైనా అక్కడ కాసేపు కూర్చోవాలనిపిస్తుంది!

               ఉభయ మద్యం దుకాణాల  ప్రాంతంలో నిన్నా-మొన్నా ఊడ్చినా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు ఏరినా ఈ పూట కూడ 20 వస్తువులు ఏరవలసి వచ్చింది.

               రాయపాటి వారి గృహ-దుకాణ సముదాయాల దగ్గరి డ్రైనూ అంతే! ఇవాళటి షణ్ముఖ శ్రీనివాసునుకి దక్కిన మొత్తం సీసాలూ-గ్లాసులూ మరొక గోనె సంచి నిండుగా.

               అమరావతి రాజభవనం వెలి ఉద్యానాలు ఈ ఉదయం చూస్తే 95% బాగుపడి, స్వచ్ఛతా ప్రియులకు కనువిందు చేస్తున్నవి.

               నిన్నటి క్రొత్త కార్యకర్త శివరామ్ నేడూ ఆగిపోలేదు. కిడ్నీ టెస్టులు చేయించుకోవలసిన కార్యకర్తలింకా కొందరు మిగిలారట!

               కొంత అస్వస్తుడైన కొర్రపాటి వీరసింహుల వారి నేటి పునరాగమనం మరొక విశేషం!

               నేటి వెరైటీ నినాదాల వంతు పల్నాటి అన్నపూర్ణది.

               DRK డాక్టరు గారు నేటి శ్రమదాన సమీక్షతోబాటు హెడ్ లైట్లు, కాలి బూటు వంటి కొన్ని జాగ్రత్తలనూ, బుధవారం బెజవాడలో జరుగనున్న సజాతీయ పక్షుల సమావేశం సంగతీ ప్రస్తావించారు.

               రేపటి కార్యకర్తల బాధ్యతలు సైతం రిలయన్స్ స్మార్ట్ ప్రాంతమందే!

              ఇదె గదా నిష్కామకర్మము-2

ఊరి విజ్ఞులు కదలకున్నా, కార్యకర్తలు చాలకున్నా,

ఖర్చు భారం పెరుగుతున్నా - గ్రామ బాధ్యత తరగకున్నా

 జంకకుండా కార్యకర్తల అడుగు ముందుకె సాగుచున్నది

 ఇది గదా ఒక స్తిత ప్రజ్ఞత ! ఇదె గదా నిష్కామకర్మము!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   16.03.2026