పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!
మార్పు పెద్దగా లేని మంగళవారపు (17th మార్చి-2026) సేవలు - @ 3775*
మళ్లీ ఇంచుమించు అదే బందరు వీధి భాగము; చిట్ట చివరగా ఉద్యమ సమీక్షా సభకు వచ్చిన వీరసింహునితో సహా అచ్చం నిన్నలాగే 33 మంది కార్యకర్తలే! మళ్లీ అమరావతి ప్రభువుల ప్యాలెస్ ఎదుటి ఉద్యానాల శుభ్ర-సుందరీకరణమే!
గ్రామ వీధి కాలుష్యాలను వెంటాడినవి కార్యకర్తల కత్తులూ, గొర్రులూ, చీపుర్లూ, డిప్పలే! ప్రోగుపడినవి ఇసుకా, దుమ్ములే! అవి చక్కగా పనికొస్తున్నది ఊరి మరొక వీధి మార్జిన్ల గుంటలకే!
పెద్దగా మారని మరొకటి 4.10-6.12 ల నడిమి పని వేళే! తుది సభాస్థలి సైతం నిన్నా మొన్నటి వలే దంత వైద్యశాల ముందే!
ఇక మార్పులేమంటే:
- ఐదారు రోజుల క్రితం అంతగా స్వచ్ఛ-శుభ్రతలు ఉట్టిపడని ½ కిలోమీటరు బందరు మార్గం ఇప్పుడు నయన మనోహరం!
- సూర్యచంద్రుల్లోనైనా మచ్చలున్నాయేమో గాని, వంక పెట్ట వీలు లేనివి ఈ ఉద్యానాలు, కర్మల భవన ప్రాంగణం, కొంతవరకు సజ్జా-మునసబు వీధులలో అనివార్యంగా వచ్చిన అద్భుతమైన శుభ్ర-సౌందర్యాలే!
- నేటి నినాదాల వంతైతే-మైకుతో కుస్తీ పడుతూ గోళ్ల కృష్ణ గారిది!
నాలుగు రోజుల వీధి బాధ్యతలను సమీక్షిస్తూ డి.ఆర్.కె. డాక్టరు గారు అంత ఆనందపడటం ఎందుకో, ఇంత మురికి-దుమ్ము-చెత్త శ్రమదానానికంతగా మురిసిపోవడమెందుకో-6 వ పంట కాల్వ నుండి రిలయన్స్ మాల్ దాక కనిపిస్తున్న బందరు వీధి అందచందాల నడిగితే తెలుస్తుంది!
కాకపోతే శ్రమజీవులైన కార్యకర్తలు స్థానికుల్నీ, ఇతర ప్రయాణికుల్నీ వేడుకొనేది ఒక్కటే – ఈ ముచ్చటైన వీధి సుందరాకృతిని చెడగొట్ట వద్దని మాత్రమే!
రేపటి శ్రమ వేడుకకై తూర్పు రామాలయం వద్ద ఆగాలని కార్యకర్తల నిర్ణయం!
ఇది గదా ఒక స్తితప్రజ్ఞత-3
సేవలనె ఒక ఉత్సవంగా- బాధ్యతలనే పండుగలుగా
ఊరి క్షేమమె స్వ స్వస్తతగా – స్వచ్ఛ శుభ్రత ఉద్యమంగా
హరిత సంపద సృష్టి కోసం అడుగు లేస్తే కార్యకర్తలు....
ఇవి గదా నిష్కామకర్మలు ? ఇది గదా ఒక స్తితప్రజ్ఞత?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
17.03.2026