3777* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వదులుకుందాం!

ఈద్గా మైదాన వీధిలో పారిశుద్ధ్య చర్యలు - @3777*

               ఉగాది, రంజాన్ పండుగలు గురు-శుక్రవారాల్లో వరసగా రావడమూ (మార్చి, 19, 20 తేదీలు-2026), ముస్లిమ్ ల పవిత్ర పర్వదిన సందర్భంగా ఈద్గా పరిసరాలను కార్యకర్తలు శుభ్రపరచడమనేదొక ఆనవాయితీగా రావడమూ వలన బందరు వీధి నుండి  ఈరోజు శ్రమదాన స్థలం మారినది;

               మసీదులో ప్రార్ధనల వల్ల ఆలస్యంగా వచ్చిన భక్తులూ, స్వచ్ఛంద శ్రమదాతలూ కలిపి, ఒక దశలో 77 మందిగా లెక్కతేలింది. ఆశ్చర్యకరంగా 60-70 గజాల బజారులోనే ట్రాక్టరు నిండి ఇంకో గజం ఎత్తు వ్యర్ధాలు దొరికాయి. యధాప్రకారం పని వేళలో ధూళిమేఘం క్రమ్ముకొన్నది. పైగా ఆ ఇరుకు రోడ్డులో వాహనాల రాకపోకలూ!

               ఇంతకీ నేటి ఈద్గా లోపలా, బయటా శ్రమించిన కార్యకర్తలెవరు? సగానికి పైగా ముస్లిం సోదరులు, ఐదారూళ్ళ నుండి తరలి వచ్చిన 10-14 ఏళ్ల బాల బాలికలు! ఐతే ఒక్కర్ని మినహాయిస్తే స్థానికుల సంగతి?

               ఈ విషయాన్నే ప్రత్యక్షంగానో-పరోక్షంగానో తుది సమావేశంలో వక్తలు ప్రస్తావించారు. నాకేమనిపించిందంటే-గ్రామస్తుల్లో ఎక్కువ మంది స్వచ్ఛ రథసారధులనో-కార్యకర్తలనో శ్రుతిమించి పొగడకుండా వారానికొకమారైనా తమ తమ వీధి బాగు చేతల్లో శ్రద్ధ చూపాలని!

               “ఈ స్వచ్ఛంద సేవకులలో బాలకార్యకర్తల సంఖ్య పెరగడం గ్రామ వాతావరణ భవిష్యత్తుకు శుభసూచకం” అని ఒక ముస్లిం పెద్ద వ్యాఖ్యానం!

               “హిందూ-ముస్లిం-క్రైస్తవులు అందరు కూడా మానవులు....” అనే నందేటి వాని పాట సందర్భోచితంగా ఉన్నది.

               ‘నిన్న విజయవాడలో ఉభయ తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిరక్షక మిత్రులు 45 మంది పాల్గొన్న సభలో ప్రకృతి ధ్వంసానికి పాల్పడకుండా మనుషులు ప్రకృతికి దగ్గరగా- సహజంగా బ్రతకవలసిన’ అంశం మీద నేను స్వచ్ఛ చల్లపల్లి సైనికుల పదకొండేళ్ల అదే ప్రయత్నాన్ని వివరించాను. అతిగా మనను పొగడలేదు గాని, ఆరేడుగురు తప్పక చల్లపల్లి శ్రమదానాన్ని చూసి తీరాలని కోరారు!

               సభా పార్రంభం ఆర్య-ఆరవ్ ల నినాదాలతో ప్రారంభమై, రేపటి వేకువ కమ్యూనిస్టు బజారు వద్ద మొదలయ్యే వీధి బాధ్యతలకు ఆహ్వానంతో ముగిసింది.

      ఇది గదా ఒక స్తితప్రజ్ఞత - 5

నీలి నిందల నెదుర్కొంటూ, అపోహలను పరిష్కరిస్తూ

చెట్లు ముప్పది వేలు పెంచుచు, గ్రామ వీధుల శుభ్రపరచుచు

పేడలెత్తుచు, మురుగు తోడుచు ఊరి సౌందర్యాలు పెంచుట....

 ఇవే గద నిష్కామ కర్మలు? ఇవే మరి స్థిత ప్రజ్ఞ లంటే!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   19.03.2026