3778* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వదులుకుందాం!

నేటి (శుక్రవారం - 20-3-26) పనిదిన సంఖ్య @3778*

               ఇక-వీధి పారిశుద్ధ్య నిర్ణీతకాలం కన్న పావుగంట ముందుగానే- అనగా 4.15 కే పనిలో దిగిన స్వచ్చోద్యమ శీలురలో సగం మంది వెంకటాపురం పాఠశాల వారే!

               వారు 11 మందీ పని చేయాలనుకొన్నది కమ్యూనిస్టు వీధి నుండి పడమర దిశగా బందరు మార్గములోనే గాని, అంతకుముందు పరిశుభ్రతలో కొన్ని లోపాల వలన ఆ మసీదు భాగం నుండి ప్రారంభించారు.

               ఇంకొద్ది సమయానికే చేరుకొన్న కార్యకర్తలతో షాబుల్ బజారు దాక పూర్తిగానూ, పోలీస్ ఠాణా వీధి దాక పాక్షికంగానూ బందరు వీధి సుందరంగా మారినది!

               చంటి హోటల్ ఎదుటా, కమ్యూనిస్టు వీధి సమీపానా ఎవరు నరికి తెచ్చిపడేసిన ఎండు కొమ్మల గుట్టలో గాని, ఈ వేకువ గంటకు పైగా సగం మంది కార్యకర్తలకు చేతినిండా పని కల్పించాయి! బహుశా ఆ గుట్టలు ఈ సాయత్రం పంచాయతి ట్రాక్టరు కోసం ఎదురు చూస్తుంటవి!

               ఇంతకన్నా కష్టతరమైన పారిశుద్ధ్య కార్యం రాజ్యలక్ష్మి ఆస్పత్రి-వీధి ఎదుట-బందరు రోడ్డు ఉత్తరపు డ్రైను పని! కుడి-ఎడమ చేతి వాటాల ప్రసాదులిద్దరు ఎంత మొండిగా కష్టించారో-డ్రైను ఘాటు కంపు ఎలా భరించారో వాళ్లనే అడగాలి!

               చూసేవాళ్లకు తేలిక అనిపించే మరొక కష్టమైన పని సుమారు 10 మందిది! నలుగురి చీపుళ్ళు నిర్విరామంగా ఊడిస్తే ½ కిలోమీటరు బారునా ప్రోగులు పడిన 50 కి పైగా ఇసుక-దుమ్ము మిశ్రాలను డిప్పలకెత్తి, ట్రాక్టరు నింపిన ఘనత మిగిలిన 6 గురిది!

               టిఫిన్ హోటళ్ల వారితో సహా ఏ స్థానికులూ నేటి గ్రామ బాధ్యతలు పంచుకోనే లేదు. సుభాషిణి మేడమ్ బ్యాచేమో ఉదయపు స్కూల్ పని మీద 6.00 కు ముందే నిష్క్రమించింది. నడుం నొప్పి పీడిస్తున్న స్వచ్ఛ వైద్యుడేమో ఈ ఉదయం హాజరు కాలేదు!

               ఆకుల భరత్ ఉద్యమ నినాదాలతో తుది సమావేశాన్ని ప్రారంభించగా…

               రేపటి వేకువ సంత వీధి కలయిక వద్ద నుండి మన వీధి పనులు ప్రారంభమని తేల్చినది గంధం బృందావనుడు!

               ఇది గదా ఒక స్తితప్రజ్ఞత -6    

‘అహమ్ బ్రహ్మ’ని, ‘శివోహమ్’ అని ఆర్య సూక్తులు చదివితిమిగద

ప్రజల సేవే దైవ సేవను పరమ అర్ధం తెలుసుకొనుచు ప

దేళ్లుగా శ్రమదాన మందున నిమగ్నులుగా మిగిలి పోయిరి

అది సుమా స్థిత ప్రజ్ఞ  అంటే! అది సుమా నిష్కామ కర్మము!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   20.03.2026