3779* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వదులుకుందాం!

శనివారం కావడంతో - (21.3.26) @3779*

               4.16 కే 21 మంది స్వచ్ఛ కార్యకర్తలు సంత బజారు-బందరు వీధి జంక్షన్ లో గ్రామ పారిశుద్ధ్య పనులకు సిద్ధమయ్యారు. వీరిలో 5 గురు 4 కిలోమీటర్ల వెంకటాపురం పాఠశాల వారూ, 12-14 ఏళ్ల బాల బాలికలూ అంటే ఆశ్చర్యపోతారేమో!

               అసలీ 39 మంది చల్లపల్లి స్వచ్చోద్యమకారుల్లో సగం మంది చల్లపల్లి వారే కాదు! ప్రక్క ఊళ్ళ వారూ, వివిధ కారణాలతో చల్లపల్లిలో స్థిరపడిన వారూ అన్నమాట! ముఖ్యంగా “చదువుకొనే ఈ చిన్నారులెవరు? ఎంత వేకువనే లేచి, మధ్యలో రెండూళ్లు దాటుకొని, 4.00AM. కే సంత వీధిలో వేచి ఉండటమెందుకు?” వంటి ఆరా తీయరా ఈ గ్రామస్తులు?

               పోలీసు స్టేషన్ బాట నుండో, షాబుల్ బజారు వద్దనో ప్రారంభం కావలసిన ఈ శనివారపు వీధి పారిశుద్ధ్యం, మళ్ళీ నిన్నటి చోట నుండి మొదలైంది. ఈ సారి చీపుళ్ల వారు షాపుల మెట్లు కూడా వదలకుండ పట్టి పట్టి ఊడిస్తే-

               ఒక్క రోజుకే మళ్లీ 20 డిప్పల దుమ్మూ+ ఇసుకా, కొన్ని ప్లాస్టిక్, గాజు వస్తువులూ ఎలా వీధిలోకి చేరాయో గాని-

               ½ గంటపాటు ఆ పునః సుందరీకరణ పూర్తయ్యాకనే స్వచ్ఛ కార్యకర్తలు సంత వీధి మొదలూ, అటు నుండి పడమరగా సాగారు.

               అడుగడుగునా టీ షాపుల, కూరల, పచారీల, మందుల, కొబ్బరి బొండాల, పూల కొట్ల వ్యర్ధాల లభ్యత వల్ల, ATM సెంటర్ల రోడ్డు మార్జిన్ లోని హోటళ్ల ఎన్నెన్నో వ్యర్ధాల వల్ల, ఇంకా దేవస్ధానాల రద్దీ ప్రాంతం కావడం వల్ల నేటి బందరు మార్గ శుభ్ర-సుందరకరణం 150 గజాలకు మించి సాగలేదు!

               సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్ధాలు కూడ చిన్న గోనె సంచిడు మాత్రమే దొరికాయి.

               రోజూ 12+12 కిలోమీటర్లు ప్రయాణించే నర్సు పండలనేని శ్రీ కనకదుర్గ ప్రకటించిన స్వచ్చోద్యమ లాంఛన నినాదాలతో తుది సమావేశము మొదలై, ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న NRI రాజ్ గర్నెపూడి గారి పర్యటన స్పచ్ఛ సుందర చల్లపల్లి రాక గురించీ,

               రేపటి వైద్య శిబిర కారణాన మన వీధి బాధ్యతలు విజయవాడ రోడ్డులోని విజయా కాన్వెంట్ వద్దకు మార్చడమైనది!

               ఇది గదా ఒక స్తితప్రజ్ఞత-7

శ్మశానాల్లో సంచరిస్తే, మురుగు కాల్వలు సంస్కరిస్తే

వీధి పేడల నెత్తి మోస్తే.... సహకరించక ఒక్కరిద్దరు గేలిచేస్తే

చలించక తమ ఊరి సేవల తరిస్తుందురె కార్యకర్తలు!

అదయ్యా నిష్కామ కర్మము! అదే సార్ స్థిత ప్రజ్ఞ అంటే!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   21.03.2026