3783* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వదులుకుందాం!

3783* వ నాడు!

               అనగా బుధవారం వేకువ 28 మంది గ్రామ సామాజిక సేవకులతో ATM కేంద్రం మొదలు చల్లపల్లి మూడు రోడ్ల సెంటర్ దాకా జరిగిన శ్రమ విశేషాలకు ఇవిగో సాక్ష్యాలు.

               కార్యకర్తలు 28 మందే కావచ్చు గానీ, వాళ్ళ పనులకు శంకర శాస్త్రి గారి ఫోటోల రూపంలో కావలసినన్ని ఉదాహరణలు ఉన్నాయి. అదనంగా ఇంకా కొన్ని రుజువులు కావాలంటే నిన్నటి దినపత్రికలలో మండలి బుద్ధప్రసాద్ గారి “స్వచ్ఛ చల్లపల్లి” మిషన్ గురించిన ప్రశంసలు వినండి.

అచ్చంగా నేటి శ్రమ, కార్యకర్తల ఉత్సాహపూరిత శ్రమదానాన్ని చూడాలంటే...

1. క్రొత్తగా కట్టిన సచివాలయం దగ్గరి ఇప్పటి పరిశుభ్రతలను చూడండి. అక్కడి ఇసుకను ఎంతగా చదును చేశారో, చిన్న కార్ల స్టాండ్ చుట్టూ ఇప్పుడు ఎంత అందంగా తయారైందో గమనించవచ్చు.

2. పెట్రోల్ బంకు ప్రాంతం కానీ, బేకరీ షాపుల వద్ద కానీ, ఆయిల్ కొట్ల సమీపంలో కానీ, గణేష్ ముద్రణాశాల వద్ద కానీ మీరు ఇప్పుడు ఒక కాగితం ముక్కనో, సింగిల్ ప్లాస్టిక్ వస్తువునో చూపెట్టగలరా?

3. ఈరోజు సాయంత్రం మూడు గంటలకి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు సచివాలయంలో కార్యక్రమం కోసం వస్తున్నారని స్వచ్ఛ కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఈరోజు పని చేశారో గమనించాను.

               అందుకే ఈనాటి స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలను ప్రకటించిన సర్పంచ్ కృష్ణకుమారి గారు తన ఢిల్లీ పర్యటన విశేషాలను, అసలు ఆ పర్యటనకు మూలకారకులైన స్వచ్ఛ కార్యకర్తల శ్రమను గుర్తు చేసి, ఎవరి మూలంగా స్వచ్ఛ సుందర చల్లపల్లి రూపొందినదో వాళ్ళను ఈ సాయంత్రం సచివాలయం వద్ద కార్యక్రమానికి అభ్యర్థించారు.

               డాక్టర్. డి. ఆర్. కె గారు తన మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనను గురించి వివరించి, సోమవారం నాడు రాజ్ గర్నెపూడి, ఆవారా డాక్టరయిన అజయ్ గారి “స్వచ్ఛ చల్లపల్లి” ఆగమనాన్ని గురించి ప్రకటించి,

               రేపటి కార్యక్రమం కోసం మెయిన్ సెంటర్ లోని  HERO షోరూం వద్ద కలుసుకుందామని నిర్ణయించుకుని నిష్క్రమించారు.

            అది సుమా! అసలైన దాతృత – 11

ఎక్కడమెరిక-ఎచట ఇండియ? ఎవరు ఆ నాదెళ్ల సురేశుడు

సుషుప్తిలోనూ కలవరింతగ ఊరి పట్ల ఎంత బాధ్యత?

సొంత ఖర్చులు పొదుపుచేస్తూ ఉద్యమానికి ఎంత త్యాగం!

అది సుమా! అసలైన దాతృత - అదే గద నిష్కామ కర్మము?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   25.03.2026