పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?
సోమవారం (30.3.26) నాటి శ్రమదాతలు 32 మంది - @3788*
అందులో 11 మంది హాజరు 4.20 కే! నేటి తుది సభాపర్వం ముగిసింది 6:25 కు, అంటే తమ గ్రామ వీధి సుందరాకృతి కోసం తమ 2 గంటలకు పైగా సమయం దానం చేసినట్లే గదా? తరువాత వచ్చిన 21 మందితో బాటు కార్యకర్తల సమయ సమర్పణ సుమారు 40 పని గంటలు!
స్వచ్ఛ కార్యకర్తల నేటి శ్రమ స్థలం విజయవాడ బాటలోని శ్రీమంతు క్లబ్బు మొదలు తహసీల్దారు కార్యాలయం దాక! మధ్యేమధ్యే అగ్రహారపు అడ్డ వీధి భాగమూ, బైపాస్ మార్గ ప్రవేశమూ ఉన్నవనుకోండి!
అసలీ కార్యకర్తల దైనందిన శ్రమ ఎలాంటిదో - దాని విలువేమిటో - చేసేవాళ్లకు కొంతా, చూసే నాబోటి వాళ్లకు మరికొంతా తెలుస్తుంది గాని, దారిన అటూ ఇటూ వెళ్లే – వచ్చే గ్రామస్తులకు తెలిసేది తక్కువ!
అగ్రహారం ప్రక్కన ఘాటు డ్రైను వాసన పీలుస్తూ, దుమ్మూ+చెమటా కలిసి ఒంటికి పేస్టులా అంటించుకొన్న తూములూరి – గంధం – కస్తూరి - మాలెంపాటి వంటి 7 గురి ప్రయత్నం కాని,
HDFC బ్యాంకు ముందూ, ఉత్తరాన మినీ గార్డెన్ లో గడ్డి పీకి, పిచ్చి మొక్కల్ని ఖండించి, ఆ రెండు వీధుల కూడలిని ఆహ్లాదకరంగా మార్చిన - సర్పంచి దంపతులతో సహా డజను మంది ఉత్సాహం కాని,
2 గోనె సంచుల సీసాలు, గ్లాసులు, కప్పులు ఏరిన ఇద్దరి పట్టుదల, MDO, MRO ఆఫీసుల ముందు శుభ్రపరచిన ఆరేడుగురి కష్టం కాని,
ఏమాత్రం వృధా పోలేదు. ముందుముందెవరైనా ఈ 12 ఏళ్ల శ్రమదాన చరిత్రను గ్రంథస్తం చేస్తే ప్రతి పేజీలోను ఈ శ్రమ త్యాగధనుల ప్రస్తావన తప్పదు!
పని స్థలం దగ్గరి షాపులు, గృహాల వారు గాని, ఆ సమయంలో వస్తూ - పోతూ ఆగి, కార్యకర్తల కష్టాన్ని చూడనోచని గ్రామస్తులులకు గాని నా అభ్యర్ధన ఇదే : దయచేసి ఈ ఉదయం అటుగా వెళ్లి సదరు శుభ్ర – సుందరీకృత ప్రాంతాన్నొకమారు చూడండనే!
నేటి ఉద్యమ నినాదకారుడు విశ్రాంత సివిల్ ఇంజనీరుడైన అంబటి శంకరుడే, తన 3 రోజుల ఉత్తరాంధ్ర పర్యటననూ, ఆయా పర్యాటక ప్రదేశాల అపరిశుభ్రతనూ వివరించినది దాసరి రామకృష్ణ వైద్యుడే.
రేపటి స్వచ్ఛ శుభ్రతా ప్రయత్నం నడకుదురు వీధి కూడలి వద్ద పెట్రోలు బంకు ఆవరణ వద్దనే!
స్థిత ప్రజ్ఞా -కాద? తేల్చుడు – 16
పనిస్థలానికి తేళ్లు రాగా, పాము కాలికి చుట్టు కొనగా,
పురుగు పుట్రా కదులు చుండగ, ముళ్లు ఒంటికి గీరుకొన్నా...
వెన్ను చూపక - ఇంట్లో పండక- వేకువనె మరునాడు వచ్చే
స్వచ్చ సుందర కార్యకర్తది స్థిత ప్రజ్ఞా -కాద? తేల్చుడు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
30.03.2026