పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?
ఇది (మార్చి చివరిది – మంగళవారం) మరొక చిరస్మరణీయమైన రోజు - @3789*
ఏమా ప్రత్యేకత – ఎట్టిదా విశిష్టత - ఎందుకా చిరస్మరణీయత అంటే – ఈ వేకువ 4.25 కు ఊరి చివర – నడకుదురు రోడ్డు మొదట - పెట్రోలు బంకు వద్ద అమెరికా నుండి, బెజవాడ నుండి ఇద్దరు సేవా దురంధరులు - రాజేంద్ర గర్నెపాటి, అజయ్ కాట్రగడ్డలతో సహా 19 మంది ఛాయాచిత్రాన్ని గమనించండి. 6:30 తరువాత, ముగింపు సమావేశంలో ముగ్గురు కార్యకర్తలు నిష్క్రమించగా, మిగిలిన 49 మంది వైఖరులనూ కనిపెట్టండి!
ఇంకా –
1) డాక్టర్ పద్మావతి గారి నినాదాలనూ, 31 వేలను తన మిత్ర బృందం నుండి నొప్పి తెలియకుండా సేకరించి, ‘మనకోసం మనం’ ట్రస్టుకు సమర్పించడాన్ని ఆలోచించండి.
2) నందేటి శ్రీను స్వచ్ఛ సుందరోద్యమ గానాన్ని గుర్తు తెచ్చుకోండి!
3) ముఖ్యంగా 12-14 ఏళ్ల ముగ్గురు విద్యార్ధుల అభిప్రాయాలను గర్నెపాటి గారు పలికించడాన్ని తప్పక పట్టించుకోండి!
4) సామాజిక సద్భావనలలో పరిణతి చెందిన, పదిహేనేళ్లుగా విజయవాడ వద్ద కృష్ణానది కల్మషాలను తొలగిస్తున్న అమరావతి వాకర్స్ & రన్నర్స్ (ఆవారా) వ్యవస్థాపక వైద్యుడు కాట్రగడ్డ అజయ్ గారు – స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తల గురించి ప్రకటించిన మాటల్ని తలచుకోండి!
5) అమెరికాలో హాయిగా కాలం గడపక, అమెరికాలాగే తన మాతృదేశం “లిట్టర్ ఫ్రీగా, స్వచ్ఛ చల్లపల్లి లాగా” ఉండాలనే తపన గర్నెపాటి గారి కెందుకో తెలుసుకోండి!
6) గత 12 ఏళ్లలాగే ఈ వేకువ కూడ 48 మంది స్వచ్ఛ - సుందరోద్యమకారులు తలా గంటన్నరపాటు డ్రైన్ లోనూ దిగారు, వీధి దుమ్ము తుడిచారు, పెట్రోలు బంకు మలుపు గుంటను పక్కాగా పూడ్చి, వందలాది వాహన చోదకుల భద్రతకూ ప్రయత్నించారు, పెట్రోలు బంకు మూలమూలల్నీ శుభ్రపరిచారు.
7) మరి - ఇలాంటి సందర్భాన్ని పల్నాటి అన్నపూర్ణ వదలిపెడుతుందా?
2 ½ టిఫిన్ల మంచి రాగి జావను గ్లాసుల కొద్దీ త్రాగించనే త్రాగించింది!
8) నేటి మన గ్రామ సందర్శకులైన ఇద్దరు అతిథులు ఊరంతా తిరగడమూ, శ్రమదానోద్యమ ప్రభావాన్ని పరిశీలించడమూ నేనిది వ్రాస్తున్న 8:15 కు కొనసాగుతూనే ఉన్నది.
రేపటి మన శ్రమదానం కూడ NTR పార్క్ వద్ద మొదలు కాబోతున్నది.
చపల బుద్ధా? స్థిత ప్రజ్ఞా -17
జారిపడినా తిరిగిలేస్తూ, ట్రాక్టరెక్కీ చెత్త త్రొక్కీ
మురుగు గుంటల ఘాటు వాసన ముక్కుపుటముల పీల్చుకొంటూ
ఎండవానలు, చలీ మంచులు లెక్క చేయక శ్రమిస్తుండే
స్వచ్ఛ సుందర కార్యకర్తది చపల బుద్ధా? స్థిత ప్రజ్ఞా ?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
31.03.2026