పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?
2026 ఏప్రియల్ మాసంలో శ్రమదాన శుభారంభం! -@3790*
సీనియర్ డాక్టర్లతో, వెనుకటి - ఇప్పటి ఉద్యోగులతో – రైతులతో - చిరుద్యోగుల – నిరుద్యోగుల – వ్యాపారుల – గృహిణుల - మొత్తం 33 మందితో బెజవాడ రోడ్డులోని NTR పార్క్ ప్రాంతం కళకళలాడింది.
4.16 నుండి 6.10 దాక పార్క్ లోని నడక మిత్రులతో, ప్రవేశ - నిష్క్రమణ వివిధ వాహనాలతో సందడి నెలకొన్నది.
ఎవరు రోడ్డు ఊడవాలి, బాటకు తూర్పు పడమర డ్రైన్లను ఎవరెవరు కలుపు కాడల్ని లాగి, ప్లాస్టిక్ సామాన్లను గట్టెక్కించి, బట్టలకు మురుగు మరకలంటుతుండగా గంటన్నర పనిచేయాలి వంటివి ముందే లెక్క ఉన్నది గనుక ఆయా శుభ్రతలు జరిగిపోయినవి.
45 పని గంటల కృషికి సాక్ష్యంగా ట్రాక్టరు నిండా వ్యర్ధాలు చేరినవి. లోడింగు వారికి చెత్త లోడింగే తప్ప - దుమ్మూ ఇసుకా చేరవేతలు ఈ పూట లేకపోయినవి.
నిన్న నయం - ఒక చిత్తు కాగితాలేరుకొనే కుర్రవాడు స్వచ్ఛ కార్యకర్తలతో కలిసి పనిచేశాడు, ఈపూట అక్కడ కనిపించిన వందలాది మందిలో ఒక్కరైనా అలా సహకరించలేదు.
నిన్నటి వలెనే కాగితపు ముక్కల రహిత చల్లపల్లి కోసం అమెరికా నుండి వచ్చిన పెద్ద డాక్టరు రాజేంద్ర తదితరులు ఈ వేకువ కూడ పనిచేశారు.
బంకులోనూ, NTR విగ్రహం వద్దా క్రొత్తగా చెత్త, మురికి బైట పడితే వాటి సంగతి తేల్చారు కొందరు కార్యకర్తలు.
నడకుదురు మార్గం ప్రక్క కోమలానగర్ ప్రాంతం కూడ నేటి శుభ్రసుందరీకృత ప్రదేశాల్లో ఒకటి.
నేటి తుది సమావేశాన్నుదేశించి, గర్నెపూడి రాజేంద్ర గారి శ్రమదానోద్యమ నినాదాలూ, స్వచ్ఛ కార్యకర్తల శ్రమను తేలికపరచే కొన్ని ఉపాయాలూ రాజేంద్ర గారు చెప్పారు.
వివేకానంద - విజయా విద్యా సంస్థల డైరెక్టర్ యార్లగడ్డ శివప్రసాదు గారు తమ కుమారుని వివాహ ఆహ్వాన పత్రికనందజేసి, ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో 4 వ తేదీ ఉదయం ఆ శుభకార్యానికి కార్యకర్తల్ని సగౌరవంగా ఆహ్వానించారు.
‘మనకోసం మనం’ ట్రస్టు కార్మికుల్లో ఒకరి వేతనాన్ని నెలవారీ 10,000/- చొప్పున 5 నెలలకు 50000/- చెక్కును వారి నుండి నేను స్వీకరించాను.
రేపటి గ్రామ భాగ సుందరీకరణ కోసం మనం మరొకమారు నడకుదురు బాట ప్రక్క పెట్రోలు బంకు వద్దనే కలువవలసి ఉన్నది!
చపల తత్త్వమ - స్థిత ప్రజ్ఞా – 18
ఏళ్ల తరబడి స్వచ్చసుందర గ్రామ సృష్టికి పాటుబడుతూ
ప్రతి ఫలం ఆశించకుండా ట్రస్టుకే చందాలు ఇస్తూ
చెట్లు ముప్పది వేలు పెంచుచు హరిత సంపద వృద్దిచేసే
స్వచ్చ సుందర కార్యకర్తది చపల తత్త్వమ - స్థిత ప్రజ్ఞా ?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
01.04.2026