పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేస్తే మంచిది.
ఏప్రిల్ 2- గురువారం – 3791* వ విడత గ్రామ బాధ్యతలు!
బాధ్యతల బరువు మోసినది నికరంగా 28 మంది+ చివరలో వచ్చి కలిసిన నలుగురు నడక మిత్రులు!
పనుల కాలం కొలతలు వేకువ 4.20-6.06 వరకు. ఆగినది బెజవాడ రోడ్డు లోని పెట్రోలు బంకు వద్ద; రకరకాల పర్యావరణహిత, గ్రామ శ్రేయోదాయక కృషి జరిగినది NTR పార్కు, 2 రోడ్ల జంక్షన్ ప్రాంతాలే.
6.20 వేళ ఇండియన్ ఆయిల్ బంకు ఆవరణలో కుదురుగా కూర్చొని, 3+3 మార్లు స్వచ్చ సుందర చల్లపల్లిని సాధిస్తాం - సాధిస్తాం అంటూ అంబటి శంకరుల వారు నినదిస్తుండగా 30 మంది కారకర్తలు వంత పాడారు!
ఈ వేకువ పనుల వివరాలా? భేషుగ్గా జరిగాయి! వాట్సాప్ ఫొటోలూ, వీడియోలూ అందుకు సాక్ష్యంగా నిలిచాయి!
6.30 కు ఇళ్లకు బయల్దేరే సమయానికి మరకల బట్టలూ, చెమట మొఖాలూ కూడా కార్యకర్తల కష్టానికి ఋజువులే మరి!
ముందుగా NTR పార్కు- టాయిలెట్లు గేటు దగ్గరి డ్రైను పనుల్నే చూడండి - సీసాలూ, గ్లాసులూ, విస్తర్లూ, ప్లేటులూ సరే- అంతంత పెద్ద ఎండు కట్టెలు ఎన్నాళ్ళ నుండి నానుతున్నవో గాని - నలుగురు కార్యకర్తలు వాటిని బైటకు లాగి, 10 గజాలు మోసి, తుక్కు ట్రాక్టరులో కి చేర్చారు.
ఆ డ్రైను కూ - ప్రహరీకి నడును ఖాళీ స్థలాలను 8 మంది వాలంటీర్లు శుభ్రపరుస్తుంటే- పార్కులోని వారు చూశారు గాని, ఎవరి పనిలో వారుండి పోయారు!
మహిళా కార్యకర్తలు అందుకు దక్షిణ, తూర్పు రోడ్ల దుమ్మూ ధూళీ ఊడ్చేశారు. ఒక మెండు శ్రీను కాబోలు - ఆస్పత్రి వీధి దాక ఊడ్చి గాని, పని విరమించలేదు!
ప్రాత కాలంలో వడ్లమర ఎదుటి డ్రైను కూడ ఐదారుగురి సహనాన్ని పరీక్షించింది! 2 గోతాల ప్లాస్టిక్, గాజు తుక్కులు నాకు దొరికిందీ ఇక్కడే!
గాజు సీసా ముక్క లోతుగా నా చెప్పులో దిగింది కూడా ఈ డ్రైను వద్దనే!
రేపటి పనులు మొదలయ్యేది బెజవాడ బాటలోని కరెంటు ఆఫీసు ప్రాంతములోనే గాని, మనం కలుసుకొనేది మాత్రం బంకు ఆవరణలోనే!
అది ఫలిస్తే పెద్దవిజయం-19
ఇలాచెప్పుట- ఇట్లు వ్రాయుట ‘ స్థిత ప్రజ్ఞ’ ను నిర్వచించుట
సులభమే - దాన్నా చరించుట, ‘సుస్థిరంగా నిలపడమె’ నా
బోటి వాళ్లకు చాల కష్టం అనే విషయం చాల స్పష్టం
అందు కొరకే ఈ ప్రయత్నం! అది ఫలిస్తే పెద్దవిజయం!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
02.04.2026