3795* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

 (5 రోజులు తక్కువగా) 3800* వ నాటి కోమలా నగర్ దగ్గర బాధ్యతలు !

 సోమవారం (6.4.26) నాటి సమాచారం ఇ ది- వేకువ 4.12 కే 12 మంది తొలి కార్యకర్తల ఫోటో తీసినది DRK డాక్టరు గారే!  ఆ పిమ్మట వచ్చి వారితో కలిసినది మరో 16 గురు!

అందంగా, శుభ్రంగా ఈ బృందం చేయదలచుకొన్నది విజయవాడ మార్గమే! ఐతే  దాని కిరువైపులా 2  అడ్డ రోడ్ల లోకీ కొందరు చొరబడ్డారు.

ఇలాంటి అదనపు పరిశుభ్రతల వల్లనే వారి బాధ్యతలు ఆకుల దుర్గా ప్రసాదుని దుకాణం వరకే పరిమిత మైనవి! ఈయన వ్యాపార స్థలం దక్షిణపు రోడ్డూ,  దానికి చెందిన డ్రైనూ 6-7 గురి కృషితో ఇప్పుడు బాగా మెరుగు పడ్డాయి.

వేముల- షణ్ముఖ శ్రీనివాసు ఈ పూట వచ్చినందున మళ్లీ గోతాం నిండుగా ప్లాస్టిక్ వస్తు జాలమూ, గోనె సంచి సగానికి  గాజుసామాన్లూ దొరికి, చిన్న ప్లాస్టిక్ కాగితాల ముక్కలు కనిపించని ఆ 150 గజాల వీధి భాగాన్ని చూడండి,

చెట్ల కొమ్మలు పొందిక గా కత్తిరించబడి, తగులు కొన్న వరిగడ్డి పీచులు కూడ లాగబడి, అందమైన గ్రామ వీధంటే  ఇదీ- అన్నట్లు గా విజయవాడ మార్గం కనిపిస్తున్నదా లేదా?

మరి, గంటన్నరకు పైగా అంత బారునా ఊడ్చిన వారు, గడ్డి చెక్కిన వారు, తుక్కుల- పిచ్చి మొక్కల రహితంగా డ్రైన్లనూ, వాటి గట్లనూ కత్తులతో - పారలతో పని చేసి, మార్చిన పది మంది కార్యకర్తల నిష్కామ కర్మ ఎంత ఆదర్శమైనదో వేరే చెప్పాలా?

అలాగే ఊడ్చిన దుమ్ముతో వీధి మార్జిన్ గుంటలు పూడ్చిన, తుక్కు గుట్టల్ని ట్రాక్టరెక్కించిన, దాన్ని సర్దిన కార్యకర్తల శ్రమకూడ!

6.03 కు DRK గారి విజిల్ మ్రోగినా, మరో 6-7 నిముషాలకు గాని సగం మంది పనులు ముగించలేదు!

వక్కలగడ్డ వాస్తవ్యులైన వెంకటేశ్వరరావు నేటి శ్రమదానంలో పాలు పంచుకొని, 6.20 కి తుది సమావేశాన్ని నినాదాలతో ప్రారంభించారు.

ఈ పూట వక్కలగడ్డ లో ప్రభాకర రావు మాష్టారి విగ్రహం పెడుతున్నారని తెలిసింది. 

ఒక మంచి పనితో కలిగే సంతృప్తి కార్యకర్తల్ని సుదీర్ఘకాలంగా ఎలా నడిపిస్తున్నదో డాక్టరు గారు సోదాహరణంగా వివరించారు.

రేపటి  మన  వీధి బాగుదల ప్రయత్నం విజయా కాన్వెంటు వద్ద నుండే అని ప్రకటించబడింది.

             చోద్యమనిపిస్తుంది చూస్తే!

ఎందరెందరొ మహామహులూ ఇలాగే సొంతూరి మేలుకు

చాల కాలమె ప్రయత్నించి చప్పబడిపోయారు గతమున

చల్లపల్లిలొ ప్రస్తుతం సామాన్య జనులా మహత్కార్యం

సునాయాసముగా క్రమించుట చోద్యమనిపిస్తుంది చూస్తే!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   06.04.2026