3798* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

3798* వ సామాజిక శ్రమదాన వివరాలివి!

               ఈ గురువారం వేకువ 4:20 కి పాగొలు రోడ్డులోని NTR పాఠశాల వద్ద వేచియున్నది కేవలం అరడజను మందే! ఆ పిదప వారిని కలుసుకొని, పాగోలు దిశగా తొలి మలుపు దాక శ్రమించినది మొత్తం 2 డజన్ల మందే!

               అందుకు కారణం బహుశా విజయవాడ రోడ్డుకు బదులు అనుకోకుండా అక్కడికి 2-3 కిలోమీటర్ల దూరాన పాగోలు బాటలోనికి శ్రమ స్థలం మార్పే! ఆ మార్పుకు కారణం నిన్న DRK డాక్టరు గారు పాగోలు వెళ్లి వస్తుండగా సుమారు ½ కిలోమీటరు రోడ్డులోని అస్తవ్యస్త పరిస్థితులు ఆయన కంటబడడమే!

               సదరు వీధి అస్తవ్యస్తతకు కారణం గ్రామ పంచాయితీకి గానీ, స్వచ్ఛ కార్యకర్తలకు గానీ మాట మాత్రం చెప్పకుండా విద్యుత్ కార్మికులు చెట్లను నరికి, చిందరవందరగా వదిలివేయడమే!

               సరే - ఈ తక్కువ మంది కార్యకర్తలు ఆ పద్ధతి లేకుండ పడి ఉన్న కొమ్మల్నీ, ఇతర తుక్కునూ ఎలా నరికి - గుట్టలు పేర్చారు, ఊడ్చి – ట్రాక్టరులోకి ఎక్కించారు, షెడ్డర్ లో తుక్కు చేసే వ్యర్ధాలను పొలంలో నిల్వ జేశారూ అనేదే నేటి శ్రమదాన చరిత్ర!

               సంఖ్యలో కొంచెం తగ్గినా, కార్యకర్తల్లో ఉత్సాహానికి కారణం ఈ వేకువ వీచిన చల్లగాలే! 2-3 గ్రామాల ప్రజల అహ్లాద సాధనకు వాళ్లు కష్టించడమొక విశేషమైతే - శ్రమతో ఊరుతున్న చెమట వంటికి చల్ల గాలి తగిలినప్పటి హాయి స్వచ్ఛ కార్యకర్తలకు పదేపదే అనుభవమే!

               నిన్నటి మన వాట్సప్ సందేశాన్ని సరిగా చదవని కొందరు కార్యకర్తలు విజయా కాన్వెంటు వద్దకు వెళ్లి, పాగోలు వీధికి వచ్చారు! ఇక రేపటి వేకువకు అలాంటి అస్పష్టత ఉండదు - పాగోలు రోడ్డులోని చందమామ అపార్ట్మెంట్లే రేపటి పని స్థలం!

               ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్లూ, ఏ కాలుష్యాల మీదో అక్కసు వెళ్ల గ్రక్కుతున్నట్లూ దేసు మాధురి గారు ప్రకటించిన నినాదాలతో NTR పాఠశాల ముఖద్వారం వద్ద మొదలైన తుది సభ ఆరోగ్యాన్ని గురించీ, హెల్మెట్ల వాడకం గురించీ, DRK గారి వివరణతో ముగిసింది.

               పైన పేర్కొన్నట్లుగా రేపటి మన శ్రమానందం కూడ పాగోలు మార్గంలోనే చందమామ విభాగ భవన ప్రాంతం వద్దనే!

                         సజీవ సాక్ష్యం  

శ్రమైక జీవన సౌందర్యానికి సజీవ సాక్ష్యం ఉందిగా

స్వచ్చ సంస్కృతిని వ్యాప్తి చేయుటకు చల్లపల్లి ఒకటుందిగా

                                                                      శ్రమైక జీవన సౌందర్యానికి

శ్రమ సంస్కృతితో సహకారంతో చల్లపల్లి వెలుగొందగా

శివ రామపురం, పాగోలు రోడ్లలో స్వచ్చ సైనికుల పండగ

                                                                          శ్రమైక జీవన సౌందర్యానికి

హరిత సంపదలు, రోడ్ల బరంతులు, డ్రైన్ల శుభ్రతలు పెంచగా

నలభై-ఏభై మంది శ్రమలతో రహదారులు బులిపించగా

                                                                      శ్రమైక జీవన సౌందర్యానికి

సుమ సుందర ఉద్యాన పరిమళము శుభ సందేశము పంపగా

పర్యాటకులకు చల్లపల్లి తొలి గమ్యంగా నిలిచిందిగా

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  09.04.2026