3801* వ రోజు ..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

అక్షరాలా 3801* వ సామూహిక సత్కార్యం!

               ‘ఇది ముమ్మాటికీ సత్కార్యము అనే సద్భావన కల 30 మంది బాధ్యతా పరులు పన్నెండేళ్ళుగా చేసుకుపోతూనే  ఉన్నారు! వాళ్ళకై వాళ్ళు “అహో! ఇది చాల పుణ్యకార్యం, ప్రపంచానికీ, పర్యావరణానికీ మాకూ ఉపయోగపడే మహత్కార్యం...” అని ప్రచారాలకు దిగలేదు! మాటలకన్న చేతలతోనే తమ సందేశాన్ని చాటుతున్నారు!

               అంతేకాదు - రేపటి తమ విధ్యుక్తాన్ని నిర్ణయించుకొని, నేటి కృషిని సమీక్షించుకొని, మరునాటి పనులను ఎక్కడ కొనసాగించాలో చర్చించుకొంటారు. ఇది కదా ఈ కాలానికి కావలసిన సామాజిక –సామూహిక సద్భావన, సదాచరణ!

               ఈ 12-4-26- ఆదివారం నాటి వ్యవహారమూ అంతే! ఏ 3.30-4:00 కో లేచారు, తమది కాని పాగోలు పంచాయతి పరిధిలోని NTR పాఠశాల వద్ద కలుసుకొన్నారు, తమ ఆయుధశాల ఐన ట్రాక్టర్ నుండి చీపుళ్ళు - కత్తులు - దంతెలు - పారలు - మర రంపాలు వంటి ఆయుధాలు ధరించారు,  పాగోలు రోడ్డు కాలుష్యాల పైన - అస్తవ్యస్తతల మీద తిరగబడ్డారు!

               ఇచ్ఛారీతిన సౌందర్య స్పృహ లేకుండ నరికి అడ్డదిడ్డంగా పడ వేసిన చెట్టు కొమ్మల్ని సైజులుగా నరికేశారు! ఇంకా కొన్ని చెట్ల కొమ్మలు కరెంటు తీగల్లోకి చొరబడుతుంటే ట్రిమ్ చేశారు! రోడ్డు మార్జిన్ల గడ్డినీ, పిచ్చి మొక్కల్నీ, రోడ్డు మీది దుమ్మునూ, చెత్తా చెదారాన్నీ నరికి, ఊడ్చి, టైమయిపోతుందని చకచకా ట్రాక్టర్ లో నింపుకొని,

               (మహాబోధి) NTR పాఠశాల గేటు నుండి చందమామ అపార్ట్మెంట్ల దాక శ్రమ వీరవిహారం చేశారు! ఆదర్శమనుకోండి – ఆశ్చర్యపడితే పడండి - అనుసరిస్తే అనుసరించండి!.... ఇదీ చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల నిత్యకృత్యం!

               6.25  కు 36 మందీ ఒకచోట చేరి, కబుర్ల మధ్య కాఫీలు సేవించి, నేటి కృషి వివరాలను DRK గారు సమీక్షించి, అంతకుముందు తూము ఇందిరా కుమారి గారి నినాదాలకు స్పందించి,

               రేపటి సామూహిక బాధ్యతలు కూడ చందమామ అపార్ట్మెంట్ల వద్దనే అని నిర్ణయించుకొని, గృహోన్ముఖులయ్యారు!

               ఏదైనా అనుకొండిక 

మహోన్నతా దర్శమో – మామూలుగ బాధ్యతో

ఉవ్వెత్తున సాహసమో – ఒక కనీస ధర్మమో

త్యాగానికి పరాకాష్టో – అంతరాత్మ ప్రబోధమో-

ఏదైనా అనుకొండిక  ఈ శ్రమ వేడుక గురించి !

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  12.04.2026