3806* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

ఏప్రియల్ 17 వ (శుక్రవారం) శ్రమదాన సంగతులు - @3806*

               శ్రమ వేళలు  4:22 – 6:10 అనుకొంటే – కాలుష్యాల మీద తొలియుద్ధం 11 మందిదైతే - మరో 13 మంది సహాయం అందింది. పాగోలు - చల్లపల్లి దారిలోని NTR పాఠశాల మూల మలుపే యుద్ధభూమి! సరే – 9 రోజుల ఈ వీధి శుభ్ర - సుందరీకరణం ముగిసినట్లే కనిపిస్తున్నది!

నేటి 2 డజన్ల మంది సామూహిక శ్రమ వల్ల :

- రోడ్డు తొలిమలుపుదాక ఎంత అందంగా మారిందో చూడవచ్చు,

- ఈ రహదారి ప్రయాణ భద్రత కోసం రోడ్డు మార్జిన్ గుంటల్ని ఆస్పత్రి  నర్సు ఒకామె పూడుస్తున్న దృశ్యాన్నీ చూడగలం,

- మట్టి పెళ్లలు మోసి, చెట్ల మొదళ్ల చుట్టూ పాదులు సరిజేస్తున్న  కార్యకర్తల కష్టాన్నీ అంచనా వేయవచ్చు,

- విజయవాడ వైపు రహదారి పనుల్ని అర్ధాంతరంగా 9 రోజుల్నాడు  స్వచ్ఛ కార్యకర్తలు వదలి ఈ పాగోలు రోడ్డుకు ఎందుకు వచ్చారో ఈ అందమైన బాటను చూస్తే తెలిసిపోతుంది,

- వ్యర్ధాలతో నిండిన ట్రాక్టర్ ను చూసినా ఈ 17-4-26 నాటి కార్యకర్తల ఉద్దేశ్యం నెరవేరిందని తెలుసుకోగలం!

- త్వరలో ఈ రహదారికి గవర్నమెంటు వారు పాచ్ వర్కు చేస్తారని తెలుస్తున్నది. అందువల్లనే కాబోలు - కార్యకర్తలు రోడ్డు గుంటల జోలికి పోనిది!

               BSNL నరసింహారావు గారి శ్రమదాన ప్రతిజ్ఞలతోనూ,

               DRK గారి ప్రశంసాపూర్వక సమీక్షతోనూ,

               రేపటి శ్రమ కోసంNTR స్కూలు మూల మలుపు దాటిన తర్వాతనే అనే నిర్ణయంతోనూ,

               నేటి సామాజిక బాధ్యతకు ముగింపు!

               అభాండాలె వేస్తారా?

కార్యకర్త శ్రమను గూర్చి నా కలం కదలుచున్నప్పుడు

అతిశయోక్తి వ్రాశానని అభాండాలె వేస్తారా?

ఊదర గొడుతున్నాని చదువుట ఆపేస్తారా?

అరె! భజనలు చేస్తున్నాడని అపోహలు పడుతున్నారా?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  17.04.2026