పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
ఇది సోమవారం (27.4.26) నాటి స్వచ్ఛ సుందర దిన చర్య! - @3816*
ఈ నాటి తమ సామాజిక బాధ్యతలకు కారకర్తలు నిన్ననే నాగాయలంక బాటలోని వడ్లమర ప్రాంతమని ఎన్నుకొన్నారు. ఈ వేకువ ఒకటి కాదు - 4.04 కూ, 4.14 కూ 2 ప్రారంభ ఫొటోలున్నవి చూశారా? కొందరు కార్యకర్తల పని తొందర అట్లా ఉంటది మరి!
ఈ వేకువ 6.05 వరకూ రహదారి కర్తవ్యాలు పాటించిన గ్రామ భక్తులు 33 మంది, శుభ్రంగా-అందంగా మారిన బాట 100 గజాలు, 33 మందిలో క్రొత్త బాల కార్యకర్త-7 వ తరగతి చదివే ముస్కాన్ (=చిరునవ్వు)!
నేనిలా ప్రత్యేకంగా పనిగట్టుకొని వ్రాయనవసరం లేదు-నేటి కార్యకర్తల దినచర్యే కాదు-ఏ రోజు పనుల వివరాలు కావాలన్నా శంకర శాస్త్రి గారో-DRK గారో-తూము వారో పెట్టిన ఛాయాచిత్రాలు ‘జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం’ వాట్సప్ లో దొరుకుతాయి.
ఈ 30 కి పైగా వ్యక్తుల సమూహం ఏం చేశారో విడివిడిగా చెప్పలేను గాని, వాళ్లు రహదారినీ, రెండు వైపు మార్జిన్లనూ ఊడుస్తుంటేనూ, తూర్పు ప్రక్క ఉద్యానంలో కలుపు పీకుతుంటేనూ, వడ్లమరలోకి 4 ప్రవేశ మార్గాలను కశ్మల రహితం కావిస్తుంటేనూ,
దంతెల వారు ఎప్పటికప్పుడు వ్యర్ధాలను ప్రోగులు చేస్తుండగానూ, చివరి అరగంటలో ఆరేడుగురు వాటిని ట్రాక్టర్లోకి బట్వాడా చేస్తున్నప్పుడూ, కొందరు చెమటలకు వంట్లో నీరు తగ్గి, నీళ్ళు త్రాగు దృశ్యాన్నీ, ఇద్దరు ముగ్గురు పని మధ్య జోకులు ప్రేలుస్తుండగానూ..... మొత్తం మీద ఒక అరుదైన సామూహిక సత్కార్యాన్ని చూసిన నా సంతోషం గురించైతే వ్రాయగలను.
ఎంత నిబద్ధత లేనిదే ఈ 30+ మందీ 12 ఏళ్ళగా ఇంత పెద్ద ఊరి బాధ్యతలను ఇంత సమర్థవంతంగా మోస్తారు?
స్వచ్ఛ కార్యకర్తల శ్రమదాన ఉద్దేశ్యాన్ని గంధం తర్శిత్ అనే బాలుడు తన నినాదాలతో చాటి చెప్పగా-
రేపటి వేకువ సేవల కోసం సాగర్ టాకీస్ బైపాస్ వీధిలోని పాల కేంద్రం వద్ద కలవాలని నిశ్చయించారు.
ఆంతర్యమునైన చూడు!
వాలంటీర్ణ శ్రమను చూడు, స్వస్త పడిన ఊరు చూడు
ముప్పై వేల రకరరాల మొక్కల పెంపకము చూడు
“చెత్త బండి వచ్చిందోయ్ - చె త్తను తీసుకురండోయ్...”
అనుచు తిరుగు ట్రాక్టర్ యొక్క ఆంతర్యమునైన చూడు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
27.04.2026