3817* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

3817* వ నాటిది (28-4-26) కాస్త భిన్నమైన శ్రమదానం!

               అది రెవిన్యూ కార్యాలయాల, పాలకేంద్ర ప్రాంతాన 5 ఎకరాల ఖాళీలో జరిగింది; దాని ప్రారంభ - ముగింపు వేళలు ఎప్పటిలాగే వేకువ 4.19 - 6.09; అందలి మట్టి పెళ్లల మధ్య జాగ్రత్తగా పనిచేసిన కార్యకర్తలు 32 మంది!

               ఊరి, పక్క ఊర్ల పిల్లల కోసం ఏర్పాటు కాబోతున్న క్రికెట్ మైదానమును శుభ్రపరచడమే ఈ 30 కి పైగా మంది చేసిన 40 పని గంటల శ్రమ! అందుకొరకు నిరంజనాది యువకులూ, న్యాయవాది కొడాలి మురళి, గోళ్ళ సాంబశివరావు గార్లు శ్రమదానానికి వచ్చారు.

               క్రికెట్ క్రీడను అభ్యసించవలసిన, ఆడవలసిన విద్యార్ధులకూ, యువతీయువకులకూ బహుశా సరైన సమాచారమూ, ఆహ్వానమూ అందలేదేమో! ప్రక్కనే NTR స్టేడియంలోని పాదచార బృందమైనా పాల్గొని ఉండవలసింది!

               ఊరి రోడ్లు ఊడ్చుట, చుట్టూ రహదార్ల ఉద్యాన నిర్వహణ వంటి పనులు చేసుకుపోతున్న కార్యకర్తల రొటీన్ వర్క్ లో ఇదొక మార్పు! మట్టి గడ్డల్లో కాళ్లు బెసగడం వంటి, ముళ్లు కాళ్ళకో చేతులకో గ్రుచ్చుకొనడం లాంటివి జరగలేదు. కార్యకర్తలు బాగుచేసిన స్థలం – ఒక యకరం కూడ ఉండదు.

               ఐతే - ఈ వాలంటీర్లు తమ బుద్ధిపోనిచ్చు కోకుండా MDO ఆఫీసు వెనుక ఏళ్ళ తరబడీ పేరుకుపోయిన వ్యర్ధాల జోలికి పోవడం వల్ల అవే ట్రాక్టరుకు నిండుగా ఎక్కినవి!

               నేటి తుది సమావేశం కూడ ఆ పొలంలోనే జరిగింది. గబగబా స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలను ప్రకటించేసింది యువ పాస్టర్ డేవిడ్ గోలుకొండ! తన 3 రోజుల మదనపల్లి ఋషివ్యాలీ పాఠశాల పర్యటనానుభవాలను వివరించినది డాక్టర్ DRK ప్రసాదు!

               రేపు కూడా ఇదే పొలం పనుల కోసం బైపాస్ మార్గంలోని పాలకేంద్రం ప్రక్కన కలవాలనేది నిర్ణయం!

               ఆంతర్యమునైన చూడు!

వాలంటీర్ణ శ్రమను చూడు, స్వస్త పడిన ఊరు చూడు

ముప్పై వేల రకరరాల మొక్కల పెంపకము చూడు

“చెత్త బండి వచ్చిందోయ్ - చె త్తను తీసుకురండోయ్...”

అనుచు తిరుగు ట్రాక్టర్ యొక్క ఆంతర్యమునైన చూడు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   28.04.2026