పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
32 మందితో చల్లపల్లి గ్రామ చల్లపల్లి శ్రమదాన వేడుక - @3818*
ఆ పండుగ జరిపిన వారు ఈ బుధవారం (29-4-26) వేకువ 4.20 కి 12 మందీ, 4.45 కు పదిమందీ, మిగిలినవారు మరో అడుగు లేటుగానూ! శ్రమ జరిగినది బైపాస్ వీధిలోని పాలకేంద్రం ప్రక్కనున్న 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో. అచ్చటనే ఎందుకంటే - సజ్జా చలపతి అనే చల్లపల్లి ప్రముఖుడు అందులో ఈ ప్రాంత యువతీ యువకులకు క్రికెట్, షటిల్, వాలీబాల్ వంటి ఆటల కోసం స్టేడియం నిర్మించబూనుకోవడం!
ఈరోజూ-రేపూ కాదు-మరొక రోజు కూడ స్వచ్ఛ కార్యకర్తలకు వీధి పనులు బదులు ఈ స్టేడియం బాధ్యతలే ఉండవచ్చు! 3818 రోజులు గ్రామ బాధ్యతలు మోసిన కార్యకర్తలకు మరో 2-3 నాళ్ల శ్రమ పట్ల అభ్యంతరమూ ఉండకపోవచ్చు! ఐతే –
ఊరుకు చెందిన విద్యార్ధులు-ప్రజలు-వివిధ సంఘాల వారు కూడ కొంతవరకైనా ఈ శ్రమదాన బాధ్యతలు పంచుకొంటే ఎంత బాగుంటుందో కదా!
నేటి పని జరిగింది సాఫీ రోడ్డు మీద కాదు - మట్టి పెళ్లల మధ్య! సమయము కూడ తెలవారక ముందు! పనులేమన్నా సొంతానికా అంటే అదీ కాదు! కార్యకర్తలెవరూ పూట గడవక, కూలి కొచ్చిన బాపతూ కాదు! తాము బ్రతికే సమాజం మరింత మెరుగుపడాలనే ఆలోచన తప్ప - గొప్పలకూ, మెప్పులకూ కానే కాదు! ఇక్కడే ఉన్నది స్వచ్ఛ-సుందర-చల్లపల్లి ప్రత్యేకత!
కాలు దెబ్బ తినడంతో నేనొకచోట కూర్చొని చూస్తూనే ఉన్నాను - ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏరేవాళ్లు ఏరుతూనే ఉన్నారు; ప్రభుత్వ కార్యాలయాల వెనుక వ్యర్ధాలను డిప్పలకెత్తి, ట్రాక్టర్ లోనింపే వాళ్ళు నింపుతూనే ఉన్నారు; గడ్డి పరకలూ, పుల్లలూ సేకరించే వాళ్ళూ గంటన్నరపాటు పని ఆపనే లేదు, నలుగురైదుగురేమో చెట్ల కొమ్మల్ని ట్రిమ్ చేస్తూనే ఉన్నారు; అమెరికా పౌరుడైన - చల్లపల్లి వ్యక్తి సురేష్ నాదెళ్ల చెట్టెక్కి, దాని సుందరీకరణ చేయడమూ జరిగింది!
12 ఏళ్ల నుండీ చూస్తూనే ఉన్నా ఈ చల్లపల్లి సామాజిక కార్యక్రమం నాకిప్పటికీ వింతగానే ఉంటున్నది. దీన్ని ప్రత్యక్షంగా చూడక - చదివే వాళ్ళు దాన్ని నమ్మడం కష్టంగానే ఉంటున్నది.
6.05 కు మొదటి విజిలు మ్రోగి, 6:10 కి పనులు ముగిసి, 6.15 కి అందరూ కాఫీలు త్రాగి, పొలం మధ్యనే 6.20 కి జరిగిన సమావేశంలో: అడపా గురవయ్య నినాదాలూ, సూక్తులూ చెప్పగా,
శ్రమదాన కార్యక్రమ అతిధిగా సజ్జా చలపతిరావు గారు మరికొంత సమాచారము తెలిపి,
DRK డాక్టరు గారు క్రీడాభిమానులకు ఈ స్టేడియం సంతోషం కలిగిస్తుందని తెలిపి,
రేపటి వేకువ పనులకు కూడ పాలకేంద్రం వద్దనే కలవాలని నిర్ణయించుకొని, విడిపోయారు!
పెద్ద కబురులు చెప్పకుండా
నాల్గు లక్షల గంటల శ్రమ నిజంగానే సంభవించెన?
సొంత ఊరును బాగుచేయుట ఇంత సులువా అనే విధముగ
మూడువేల ఎనిమిదొందల రోజుల శ్రమ కలా - నిజమా!
పెద్ద కబురులు చెప్పకుండా పెద్ద ఘనతలు సాధ్యపడెనా!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
29.04.2026